‘కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కోబోతున్నాం’

రానున్న రోజుల్లో ప్రపంచం అత్యంత సవాల్‌తో కూడుకున్న సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు........

Updated : 01 Apr 2020 09:26 IST

కరోనా ప్రభావంపై ఐక్యరాజ్య సమితి

వాషింగ్టన్‌: రానున్న రోజుల్లో ప్రపంచం అత్యంత సవాల్‌తో కూడుకున్న సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఈ స్థాయి మాంద్యాన్ని ఎప్పుడూ చూసి ఉండి ఉండమని అంచనా వేశారు. ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న కొవిడ్‌-19, ఆర్థిక రంగంపై దాని ప్రభావం అత్యంత అస్థిరత, అశాంతి, ఆందోళనలకు దారితీయబోతోందని చెప్పుకొచ్చారు. ‘సామాజికార్థిక పరిస్థితులపై కొవిడ్‌-19 ప్రభావం’పై నివేదిక విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్‌-19పై పోరును ప్రపంచ దేశాలు మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని గుటెరస్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయ పంతాలకు పక్కనబెట్టి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వస్తేనే ఈ మహమ్మారి సృష్టించే ఉత్పాతాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని గుర్తుచేశారు. ఐరాస 75 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదిక అభిప్రాయపడింది. ఇది కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా మానవ సంక్షోభానికి కూడా దారితీస్తుందని పేర్కొంది.

కొవిడ్‌-19ని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యల్లో ఇంకా చాలా వెనకబడి ఉన్నామని గుటెరస్‌ స్పష్టంచేశారు. ఎవరికి వారు సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల్ని ఖాతరు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు సమూకూర్చుకోలేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

ప్రధాని మోదీకి ఇవాంక ధన్యవాదాలు

వచ్చే ఏడాది కరోనా టీకా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని