సోదరుడి నుంచి వైద్యురాలికి కరోనా!

దేశవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ వైద్యులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఈమధ్యే దిల్లీలోని మొహల్లా క్లినిక్‌లో పనిచేస్తున్న ఓ వైద్యునికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అనంతరం అతనితో పాటు వైద్యుని భార్యకు వైరస్‌ సోకింది.

Published : 01 Apr 2020 13:22 IST


దిల్లీ: దేశవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌ వైద్యులకూ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యే దిల్లీలోని మొహల్లా క్లినిక్‌లో పనిచేస్తున్న ఓ వైద్యునికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అనంతరం ఆ వైద్యుని భార్యకు వైరస్‌ సోకింది. ఈ సందర్భంలో ఆసుపత్రికి వచ్చిన దాదాపు వేయిమందిని క్వారంటైన్‌లో ఉంచారు. ఈ ఘటన మరవకముందే తాజాగా దిల్లీకి చెందిన మరో వైద్యురాలికి కరోనా నిర్ధారణ అయ్యింది. దిల్లీలోని స్టేట్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమెకు కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం ఆమె సోదరుడు, అతని భార్య లండన్‌ నుంచి భారత్‌ చేరుకున్నారు. దిల్లీ వచ్చిన అనంతరం సోదరుని భార్య వైద్యురాలి ఇంటికి వచ్చినట్లు గుర్తించారు అధికారులు. వారి నుంచే ఆమెకు వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. వైద్యురాలితోపాటు ఆమె కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు ఆమె పనిచేస్తున్న ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశారు. ఆసుపత్రిలోని సిబ్బందికి పరీక్షలు నిర్వహించడంతోపాటు వారందరిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అంతేకాకుండా సదరు వైద్యురాలి వద్దకు వచ్చిన  రోగుల వివరాలను కూడా సేకరించే పనిలో పడ్డారు అధికారులు. 

ఇప్పటికే దిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 120కి చేరగా ఇద్దరు మరణించారు. కేవలం మంగళవారం ఒక్కరోజే 24కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరందరూ నిజాముద్దీన్‌ మర్కజ్‌ సభకు హాజరైనవారేనని పేర్కొంది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనాబారిన పడినవారి సంఖ్య 1397కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 35మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండీ..

కరోనా లక్షణాలతో భారతి సంతతి శాస్త్రవేత్త మృతి..

కరోనా: దిల్లీ సమావేశ నిర్వాహకులపై కేసు

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts