JKలో స్థిర నివాసంపై మార్గదర్శకాలు

జమ్ము కశ్మీర్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు జమ్ము కశ్మీర్‌లోని 138 చట్టాలకు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో స్థానికంగా.....

Published : 01 Apr 2020 17:44 IST

దిల్లీ: జమ్ము కశ్మీర్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు జమ్ము కశ్మీర్‌లోని 138 చట్టాలకు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో స్థానికంగా ఉండే వారికి గ్రూప్‌-4 స్థాయి వరకు ఉన్న ఉద్యోగాల్లో భద్రతను కల్పిస్తూ జమ్ము కశ్మీర్‌ సివిల్‌ సర్వీస్‌ చట్టంలో మార్పులు చేసినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దాని ప్రకారం బయటి వ్యక్తులు ఎవరికి గ్రూప్‌-4 స్థాయి వరకు ఉండే ఉద్యోగాలు పొందేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. కేవలం జమ్ము కశ్మీర్‌కు చెందిన వ్యక్తులు మాత్రమే అందుకు అర్హులని తెలిపింది. దానితో పాటు నిబంధనల ప్రకారం ఎవరైనా 15 సంవత్సరాల పాటు స్థానికంగా నివసించినట్లయితే వారికి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అర్హతను కల్పిస్తూ ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టింది. అంతే కాకుండా 10 సంవత్సరాల పాటు జమ్ము కశ్మీర్‌లో సేవలందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, చట్టబద్ధమైన సంస్థలు, సెంట్రల్ యూనివర్శిటి, కేంద్ర ప్రభుత్వం గుర్తింపుపొందిన పరిశోధన సంస్థల ఉద్యోగుల పిల్లలు స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు అర్హులుగా అందులో పేర్కొంది.

ఇంకా ఏడు సంవత్సరాల పాటు జమ్ముు కశ్మీర్‌లో చదువుకుని పది, పన్నెండు తరగతుల పరీక్షలకు హాజరైన వారు కేంద్ర పాలిత ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చని తెలిపింది. అంతే కాకుండా సహాయ పునరావాస కమిషనర్‌ చేత వలస వచ్చిన వారిగా గుర్తింపబడిన వ్యక్తు స్థానికంగా నివాసం ఏర్పరచుకునేందుకు అర్హులుగా పేర్కొంది.  వారితో పాటు జమ్ము కశ్మీర్ స్థానికత కలిగి ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం బయట ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పిల్లలు కూడా ఇందుకు అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ గతేడాది కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్‌లోని 138 చట్టాలలో 28 చట్టాలను రద్దు చేసింది. 

అయితే కేంద్రం నిర్ణయాన్ని జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి  ఒమర్‌ అబ్దుల్లా తప్పుబట్టారు. ‘‘కరోనా వైరస్‌ విస్తరిస్తున్న సమయంతో దాని నివారణపై దృష్టి పెట్ట్టకుండా ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ స్థిర నివాసానికి సంబందించి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అంతే కాకుండా సవరించిన చట్టాలు గతంలో  చెప్పిన విధంగా ఎటువంటి భద్రతను కల్పించడం లేదు’’ అని ట్వీట్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని