కరోనాపై పోరులో ఆస్పత్రులకు అండగా....

కరోనా సోకినవారికి అందించే చికిత్సలో వెంటిలేటర్లు ఎంతో కీలకం. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇప్పటికే కొన్ని దేశీయ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు...

Published : 02 Apr 2020 23:12 IST

దిల్లీ: కరోనా సోకిన వారికి అందించే చికిత్సలో వెంటిలేటర్లు ఎంతో కీలకం. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇప్పటికే కొన్ని దేశీయ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు తక్కువ ధరలో వెంటిలేటర్లు తయారు చేసేందుకు పరిశోధనలు ప్రారంభించాయి. తాజాగా భారత్‌కు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ దీపక్‌ అగర్వాల్‌, రోబోటిక్‌ సైంటిస్ట్‌ దివాకర్‌ వైష్‌తో కలిసి తయారు చేసిన అగ్వా వెంటిలేటర్లు భారత్‌లో కరోనాపై పోరులో కీలకం కానున్నాయి. టోస్టర్ సైజులో ఉండే ఈ వెంటిలేటర్లు ధర పరంగా ఎక్కువైనప్పటికీ ప్రస్తుతానికి ఇవే భారత్‌ను కరోనా కోరల నుంచి బయటపడేందుకు ఉపయోగపడనున్నాయి. కేవలం 3.5 కిలోల బరువుండే అగ్వా వెంటిలేటర్లను రోగులు తమ వెంట తీసుకెళ్లి ఉపయోగించేందుకు అనువుగా ఉంటాయి. ఇవి తక్కువ విద్యుత్‌తో పనిచేస్తాయి. ఒక వేళ హోటల్ గదులు వంటి వాటిని ఐసీయులుగా మార్చాల్సి వచ్చినప్పుడు వీటిని ఎంతో తేలికగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని దివాకర్‌ వైశ్‌ తెలిపారు. 

భారత్‌లో కరోనా మరణాల రేటు రోజురోజుకి పెరుగుతుండటంతో వీటి ఉత్పత్తిని నెలకు 500 నుంచి 20,000కి పెంచారు. భారత్‌లాంటి దేశాల్లో కరోనా రోగుల వైద్యానికి బెడ్లు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే స్థానికంగా నెలకొన్న డిమాండ్ దృష్ట్యా భారత్‌ ప్రభుత్వం కరోనా చికిత్సలో ఉపయోగించే పరికరాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దిల్లీలో ఉన్న అగ్వా ప్లాంట్‌లో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతితో వెంటిలేటర్ల తయారీని వేగవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆటో పరిశ్రమదారులు కూడా కరోనాపై పోరుకు తమ వంతు కృషి చేయాలని కోరడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి అగ్వా సంస్థ వెంటిలేటర్ల తయారీని వేగవంతం చేసేందుకు తన వంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చింది.

ప్రస్తుం భారత్‌లో దాదాపు 40,000 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనేది ఒక అంచనా. ఒక వేళ కరోనా తీవ్రత పెరిగి యూరప్‌ దేశాల్లో నెలకొన్న పరిస్థితి భారత్‌లో ఏర్పడితే వెంటలేటర్ల కొరత ఏర్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అగ్వా పోర్టబుల్ వెంటిలేటర్లు కరోనా రోగులకు చికిత్స అందించడంలో వైద్యులకు ఎంతో ఉపయుక్తం కానున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్‌ ఆర్‌వీ అశోకన్‌ అభిప్రాయపడ్డారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని