కరోనా: భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సహాయం

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యతిరేక పోరాటానికి గాను ప్రపంచ బ్యాంకు 1 బిలియన్‌ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

Published : 03 Apr 2020 13:25 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యతిరేక పోరాటానికి గానూ ప్రపంచ బ్యాంకు 1 బిలియన్‌ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహాయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేయనుంది. ఈ నిధులతో 40 దేశాల్లో కరోనా నిరోధక ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. కాగా, ఇందులో అధిక భాగం అంటే 1 బిలియన్ డాలర్లను భారత్‌కు కేటాయించింది.

భారత్‌లో ఇప్పటివరకు సుమారు 2,100 కేసులు నమోదుకాగా... 56 మరణాలు సంభవించాయి. ఇక జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న భారత్‌లో కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుకుంటే... ఆ ప్రభావం ఊహించలేనంత దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19కు సంబంధించి ఉత్తమ నిర్ధారణ, అనుమానితుల ఆచూకీ, ప్రయోగాలు, వ్యాధి నియంత్రణ సామగ్రి కొనుగోలు, కొత్త ఐసొలేషన్‌ వార్డుల నిర్మాణం వంటి పనులకు వాడేందుకు తాము ఈ నిధిని మంజూరు చేసినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. 

కరోనా వ్యాప్తి నివారణకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్న నేపథ్యంలో అనేక సేవలకు, సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వాల ద్వారా అత్యవసర వైద్య సామగ్రి అందించేందుకు కూడా ప్రపంచ బ్యాంకు కృషిచేస్తోంది. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు 12 బిలియన్‌ డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. సహాయం కోరిన దేశాలకు ఎనిమిది బిలియన్‌ డాలర్లు అందచేస్తామని సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా ముప్పును ఎదుర్కోవటం కష్టసాధ్యంగా పరిణమించిన పేదదేశాలను గుర్తిస్తున్నామని ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు దేవిడ్‌ మల్పాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని