మా మాట కూడా వినండి మోదీజీ: చిదంబరం

ప్రజలు మీ మాట వినడమే కాదు, మీరు ప్రజల మాట కూడా వినాలంటూ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వీడియో సందేశంపై కాంగ్రెస్ విమర్శనాత్మకంగా స్పందించింది.

Published : 03 Apr 2020 13:45 IST

వీడియో సందేశంపై కాంగ్రెస్ నేతల విమర్శలు

దిల్లీ: ప్రజలు మీ మాట వినడమే కాదు, మీరు ప్రజల మాట కూడా వినాలంటూ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వీడియో సందేశంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. సింబాలిజం ముఖ్యమే కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థితి పురోగమనానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం మోదీకి సూచించారు.

‘ప్రియమైన మోదీజీ, ఏప్రిల్ 5న మీ మాట విని దీపాలు వెలిగిస్తాం. దానికి బదులుగా మీరు మా మాటలు, ఆర్థిక వేత్తలు చెప్పే మాటలు వినండి. మీరు ఆర్థిక వృద్ధి పురోగమనానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారేమోనని ప్రతి ఉద్యోగి, వ్యాపారి, రోజూవారీ కూలీ ఊహించారు. మీ సందేశం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సింబాలిజం ఎంత ముఖ్యమో దేశం తిరిగి కోలుకోవడానికి తగిన చర్యలు కూడా అంతే ముఖ్యం’ అని ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. మరో సీనియర్ నేత శశిథరూర్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో భారతీయులంతా ఏకమై దానిని తరిమికొట్టాలని, ఏప్రిల్ 5న, ఆదివారం రాత్రి దీపాలు వెలిగించి సంకల్పాన్ని ఘనంగా చాటాలని తన సందేశంలో మోదీ ప్రజలను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని