ఆ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు రోజూ 5 వేల కాల్స్‌

గత ఆరో రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఓ మానసిక, సామాజిక హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు రోజుకీ ఐదు వేల మంది ఫోనులు చేసి తమ ఇబ్బందులు చెప్పుకుంటున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని, వారి కుటుంబ సభ్యులను, వారితో సత్సంబంధాలు...

Published : 06 Apr 2020 22:25 IST

‘కన్నబిడ్డలే ఫోన్లు చేయడం లేదు కానీ..’

చెన్నై: గత ఆరు రోజుల క్రితం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు రోజుకు ఐదు వేల మంది ఫోనులు చేసి తమ ఇబ్బందులు చెప్పుకొంటున్నారట. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు ఇంట్లోనే ఉండాలని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. తమ ఇంట్లోనే నిర్బంధంలో ఉండేవారి సామాజిక అవసరాలను తెలుసుకోవడంతో పాటు మానసికంగా వారి బాధను పోగొట్టేందుకు చెన్నై కార్పొరేషన్‌లో మార్చి 31న ఓ హెల్ప్‌ లైన్‌ సెంటర్‌ను (044 4612 2300) ప్రారంభించారు. లయోలా కళాశాలకు చెందిన సోషల్‌వర్క్‌ డిపార్ట్‌మెంట్‌ వారి సాయంతో పనిచేస్తోన్న ఈ హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో సోషల్‌వర్కర్స్‌, మానసిక ఆరోగ్య నిపుణులు పనిచేస్తున్నారు. స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి రోజు విడిచి రోజు ఫోనులు చేయడం కోసమే ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌కు ప్రతిరోజూ 5000 మంది ఫోనులు చేస్తున్నారని.. అలా వచ్చిన కాల్స్‌ను తాము కూడా అంగీకరిస్తున్నామని సంబంధిత అధికారులు, సిబ్బంది తెలిపారు.

‘విదేశాల నుంచి వచ్చి ఇళ్లలోనే స్వీయనిర్బంధంలో ఉన్న వారిలో కొందరికి సహాయక చర్యలు సరిగ్గా అందడం లేదని మాకు ఫోన్‌ చేసి చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే విదేశాల నుంచి వచ్చిన వారందరూ ధనవంతులు కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి’ అని హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ జేవియర్‌ తెలిపారు. హెల్ప్‌లైన్‌ సెంటర్‌ గురించి లయోలా కళాశాల సోషల్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆండ్రూ సేసురాజ్‌ మాట్లాడుతూ.. ‘ఇటీవల మేము ఓ 65 సంవత్సరాల పెద్దావిడకు ఫోన్‌ చేశాం. ఆరోజు ఆమె పుట్టినరోజుని.. తనకి ఫోన్‌ చేసిన మొదటి వ్యక్తులం మీరేనని ఆ పెద్దావిడ చెప్పింది. వెంటనే మేము బర్త్‌డే పాట పాడి.. ఆమెను విష్‌ చేశాం. దానికి ఆమె ఎంతో సంతోషించింది. అలాగే మరో పెద్దావిడ కూడా మేము చేస్తున్న పనికి ఆనందాన్ని వ్యక్తం చేసింది. సొంత పిల్లలు కూడా తనకి ఫోన్‌ చేయడంలేదని, మేము మాత్రం రోజు విడిచి రోజు ఫోన్‌ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నామని ఆమె తెలిపింది.’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని