ధారావిలో కరోనా: మమ్మల్ని దేవుడే కాపాడాలి

ధారవికి చెందిన 56ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌ సోకి చనిపోవటంతో ముంబయి ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆ వివరాలు మీ కోసం...

Updated : 06 Apr 2020 18:38 IST

దేశంలో అతిపెద్ద మురికివాడ వాసుల ఆక్రందన

ముంబయి: రజనీకాంత్‌ నటించిన ‘కాలా’ చూసిన వారికి బాగా పరిచయమున్న పేరు ధారావి. దేశ ఆర్థిక రాజధాని అని పిలిచే ముంబయి, ఆసియాలో అతిపెద్ద మురికివాడల్లో ఇది ఒకటి. ఇక్కడ 56ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌ సోకి చనిపోవటంతో ముంబయి ఒక్కసారి ఉలిక్కిపడింది. నగరంలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతాలకు, ముంబయి స్టాక్‌ ఎక్స్చేంజీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారావిలో ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయకపోతే ముంబయి మహానగరం ఆపదలో పడుతుంది. 

ఇదీ ధారావి...

పదిలక్షల జనాభా ఉన్న ధారావిలో అధిక భాగం వలసకూలీలు. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న ‘ఇంట్లో’ 10 నుంచి 12 మంది నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో 80 మంది వ్యక్తులకు ఒకే టాయిలెట్‌ ఉంటుందంటే ఇక్కడ జీవన ప్రమాణాలు, జనసాంద్రత ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. టార్ఫలిన్లు కప్పిన గుడిసెల్లో ఇక్కడ వందల దుకాణాలు నడుస్తాయి. 

ధారావిలో కరోనా...

ధారావిలో మొదటి కరోనా కేసు నమోదైన వెంటనే ఆ ప్రాంతానికే చెందిన ఓ వైద్యుడు (35), మరో మహిళ (30)కు కూడా కొవిడ్‌-19 ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇక ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మరో ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి, చికిత్స తీసుకుంటున్నాడు. ఇంకా 25 మంది అనుమానితుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. అధికారులు ఇప్పటి వరకు ధారావికి చెందిన 3,000 మందిని క్వారంటైన్‌కు తరలించారు. 

ఏం జరుగుతోంది?

ధారావిలో తొలి కరోనా మృతుడు ఉండే కాలనీ నుంచి ఏ ఒక్కరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. అతను నివసించిన భవనాన్ని పూర్తిగా సీల్‌ చేశారు. ధారావి సమీపంలో ఉన్న ఓ స్పోర్ట్స్‌ క్లబ్‌ను 300 పడకల ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చారు. మరో 50 పడకల ఆస్పత్రిని కొవిడ్‌ నిర్ధారణ, చికిత్సల కోసం కేటాయించారు. ధారావి ప్రజలకు ఉచితంగా ఆహారం, నీరు అందచేస్తున్నారు. ఒక్క ధారావి ప్రాంతంలోనే ఆరు వైద్య బృందాలు, 170 మంది వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు.

ఇరకాటంలో అధికారులు

ధారావిలో కరోనా మృతి చెందిన వ్యక్తి తన ఏడుగురు కుటుంబ సభ్యులతో ఉండేవాడు. నాలుగు లీటర్ల నీటిని రూ.25 చెల్లించి కొనుగోలు చేసే పరిస్థితిలో  ఉన్న వారిని తరచూ చేతులు కడుక్కోవాలి చెప్పటం ఎలా అని అధికారులు వాపోతున్నారు. మరుగుదొడ్లే లేని ఇళ్లలో ఉంటున్న ధారావి ప్రజలను ఇల్లు వదిలి బయటకు రాకూడదని ఎలా నిర్బంధించాలో తెలియక అధికారులు తికమక పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న ధారావిలో అంటువ్యాధి విస్తరణ అతి వేగంగా జరిగే ప్రమాదముంది. అంతే కాకుండా హోం క్వారంటైన్‌ విధానం కూడా ఫలితాన్నిచ్చే అవకాశాలు తక్కువే. ఇక కరోనా సోకిన వ్యక్తుల కుటుంబ సభ్యులు రకరకాల కారణాల వల్ల సహకరించకపోవటం అధికారులకు పెద్ద సమస్యగా మారింది.  

 

ఆదివారం నాటికి అందిన సమాచారం ప్రకారం... దేశంలోని కరోనా కేసుల్లో పదోవంతు, కరోనా మరణాల్లో సగం ముంబయి నగరం నుంచే నమోదయ్యాయి. దీనితో ఈ నగరాన్ని కరోనా రెడ్‌జోన్‌ ప్రాంతంగా ప్రకటించారు. ధారావిలోని దుస్తుల తయారీ కేంద్రాల్లో లక్షమంది పేద కార్మికులు పనిచేస్తున్నారు. వ్యాపారాలు మూతపడటంతో వారు తమ ఉపాధిని గురించి, కుటుంబ పోషణ గురించి, పోలీసుల ఆంక్షలను గురించి వారు ఆవేదనకు గురవుతున్నారు. ఈ ప్రాంతాన్ని సీజ్‌ చేయటానికి వెళ్లిన అధికారులపై రాళ్లు విసిరారు. అయితే దేశంలోని మిగిలిన ప్రజల్లాగే ధారావి ప్రజలకు కూడా కరోనా అంటే భయం ఉంది. తమ ప్రాంతంలో కరోనా వేళ్లూనితే పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకోవటానికే అక్కడి ప్రజలు వణికి పోతున్నారు. రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చిన మరుక్షణం తమ స్వగ్రామాలకు చేరుకోవాలని వీరు ఆతృతతో ఉన్నారు. తమ రోగ నిరోధకత, లేదా ఆ భగవంతుడే తమను కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడాలని ధారావి నివాసులు ఆక్రోశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారిలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపటమే ప్రస్తుతం ప్రభుత్వాధికారుల తక్షణ కర్తవ్యం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని