ఉగ్రపోరులో ఐదుగురు సైనికుల దుర్మరణం 

జమ్మూకశ్మీర్‌లోని కెరాన్‌ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఐదుగురు ఉగ్రవాదులు మృతిచెందగా భారత ఆర్మీలోని పారా ప్రత్యేక దళాలకు చెందిన ఐదుగురు సైనికులు దుర్మరణం పాలైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.......

Published : 06 Apr 2020 23:14 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని కెరాన్‌ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. భారత ఆర్మీలోని పారా మిలటరీ దళానికి చెందిన ఐదుగురు సైనికులు దుర్మరణం పాలైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ ఆదివారం జరిగిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని కెరాన్‌ సెక్టార్లో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి ఏప్రిల్ 2న ఆర్మీకి సమాచారం అందింది. అదే రోజున సైనికులకు ఉగ్రవాదులు తారసపడ్డారు. అయితే ఆ ప్రాంతంలో మంచు ఎక్కువ కురుస్తుడటంతో వారు పాక్ ఆక్రమిత కశ్మర్‌కు వెళ్లి ఉంటారని భావించారు. తిరిగి ఏప్రిల్ 3న మళ్లీ ఉగ్ర కదలికలను ఆర్మీ గుర్తించింది. దీంతో ఏప్రిల్ 4న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించింది. అందులో భాగంగా పారా ప్రత్యేక దళానికి చెందిన బృందాలను ఉగ్రవాదులు ఉన్న ప్రాంతంలో హెలికాఫ్టర్ల సాయంతో విడిచిపెట్టింది.

ఈ తరుణంలో సైనికులకు ఐదుగురు ఉగ్రవాదులు తారసపడటంతో ఇరువురికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో వారిని నిరోధించేందకు ఐదుగురు సైనికులు ఉగ్రవాదులు నక్కిన ప్రాంతంలోకి ప్రవేశించి వారిని మట్టుబెట్టారు. ఈ పోరులో దురదృష్టవశాత్తూ సుబేదార్‌ ఘటన ప్రదేశంలో చనిపోగా మిగిలిన నలుగురు సైనికులు దగ్గర్లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మృతిచెందిన వారిలో సుబేదార్ సంజీవ్ కుమార్, హవాల్దార్‌ దేవేందర్‌ సింగ్, పారాట్రూపర్‌ బాల్‌ క్రిషన్, పారాట్రూపర్‌ అమిత్ కుమార్‌, పారాట్రూపర్‌ ఛత్రపాల్‌ సింగ్ లు ఉన్నారు. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని