కరోనా ఎఫెక్ట్‌: జపాన్‌లో అత్యవసర పరిస్థితి

కరోనా తీవ్రత పెరుగుతన్న దృష్ట్యా జపాన్‌ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. టోక్యోతో పాటు ఇతర ముఖ్య నగరాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబే వెల్లడించారు.

Published : 08 Apr 2020 01:25 IST

టోక్యో: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. టోక్యోతో పాటు ఇతర ముఖ్య నగరాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. ఈరోజు నుంచి నెలపాటు ఈ అత్యవసర స్థితి కొనసాగుతుందన్నారు. ఇప్పటికే జపాన్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3900కి చేరగా 92మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆయా రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ఆ దేశ ప్రధాని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఫ్రాన్స్‌ తదితర దేశాల్లో ఇళ్లనుంచి బయటకు వస్తే భారీ అపరాధ రుసుం విధిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే అలాంటి చర్యలు జపాన్‌లో అమలుచేయబోమన్నారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు 993బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. అత్యధికంగా ఇటలీలో ఈ మహమ్మారి బారినపడి 16వేలకు పైగా మృతిచెందారు. స్పెయిన్‌లో గడచిన 24గంటల్లో 637 మరణాలు సంభవించగా మొత్తం 13,798 మంది మరణించారు. మరోవైపు అమెరికాలోనూ వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 3లక్షల 60వేల మంది కరోనా బాధితులు కాగా వీరిలో 10,900 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13లక్షల మందికిపైగా కరోనా వైరస్‌ సోకగా మరణాల సంఖ్య 74వేలు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని