కరోనా:న్యూయార్క్‌కు మరోసారి తీరని ఆవేదన

న్యూయార్క్‌లో కరోనా మరణాల సంఖ్య నాటి ఉగ్రదాడి మృతుల సంఖ్య కంటే అధికం...

Updated : 08 Apr 2020 14:08 IST

9/11ఘటనను మించి నమోదైన కరోనా మరణాలు

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇక ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అమెరికాలో అత్యధిక జనాభా ఉన్న న్యూయార్క్‌లో నిన్న ఒక్కరోజులో 731 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఆ మహానగరంలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 4000కు చేరుకుంది. కాగా, ఇది నాటి 9/11 ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య కంటే అధికంగా ఉండటం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

నాటి ఉగ్రదాడి...

సెప్టెంబర్‌ 11, 2001న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌కు చెందిన ట్విన్‌ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్‌ చేసి దాడికి తెగబడ్డారు. నాటి మారణహోమంలో 2,753మంది న్యూయార్క్‌ ప్రజలు మరణించగా... 25,000 మందికి పైగా గాయపడ్డారు. 10 బిలియన్‌ డాలర్లకుపైగా ఆస్తినష్టం సంభవించింది. ఈ ఘటన అమెరికాపైనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం అదే న్యూయార్క్‌ నగరంలో చోటుచేసుకున్న కరోనా మరణాలు నాటికంటే 1000 అధికం.

నేటి పరిస్థితి...

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్‌తో సహా దేశమంతటా ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని నివారణా చర్యలు తీసుకుంటున్నా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయితే ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించటం నగరంలోని సబ్‌వేల వంటి చోట్ల సాధ్యం కాదని పలువురు వాపోతున్నారు. అత్యవసర సేవల ఉద్యోగులు ప్రయాణిస్తున్న కొన్ని రైళ్లలో కూడా ఈ నియమం పాటించటం వీలు కావటం లేదని అంటున్నారు. కాగా.. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్రూ క్యోమో ప్రకటించడం కాస్త ఊరటనిస్తోంది. 

ఇక అమెరికా వ్యాప్తంగా 3,80,000 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు, 12,000 మరణాలు నమోదయ్యాయి. న్యూయార్క్‌ కాకుండా డెట్రాయిట్‌, న్యూ ఆర్లియన్స్, న్యూ జెర్సీ, కనెక్టికట్‌ వంటి మరికొన్ని ప్రదేశాలు కూడా ప్రమాదకర కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. కాగా కరోనా మహమ్మారి తొలిసారిగా వెలుగు చూసిన చైనా పట్టణం వుహాన్‌లో మాత్రం ఆ వ్యాధి తగ్గుముఖం పట్టడంతో అక్కడ లాక్‌డౌన్‌ నిబంధనను ఎత్తివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని