కరోనా పోరులో..కారులోనే వైద్యుడి నివాసం!

మహమ్మారిపై జరుపుతున్న పోరులో వైద్యులదే కీలక పాత్ర. వృత్తి ధర్మంలో భాగంగా తమ ప్రాణాలు పనంగా పెట్టి బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఎంతోమందిని కదిలిస్తోంది.

Published : 08 Apr 2020 15:51 IST

ప్రశంసించిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌

భోపాల్‌: ప్రపంచంపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరులో వైద్యులే యోధులుగా మారుతున్నారు. వృత్తిధర్మంలో భాగంగా తమ ప్రాణాలను పణంగాపెట్టి బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఎంతోమందిని కదిలిస్తోంది. ఇలాంటి అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వారి కుటుంబాలకే దూరంగా ఉంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కారులోనే నివాసమున్న ఘటన అందర్నీ ఆకర్షిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కి చెందిన డా.సచిన్‌ నాయక్‌ స్థానిక జేపీ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. కరోనా వైరస్‌ బాధితులకు కూడా ఆ ఆసుపత్రిలోనే చికిత్స జరుగుతోంది. ఈ సందర్భంలో పనివేళలు అయిపోయిన అనంతరం ఇంటికి వెళ్తే తన కుటుంబ సభ్యులకూ కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని డా.నాయక్‌ భావించాడు. అందుకోసం తన కారునే నివాసంగా మార్చుకొని ఆసుపత్రి ఆవరణలోనే నివాసం ఉంటున్నాడు. తన భార్య, పిల్లలకు వైరస్‌ సోకకుండా ఉండేందుకే ముందుజాగ్రత్తగా ఇలా చేశానని డా.నాయక్‌ అభిప్రాయపడ్డారు. ఖాళీ సమయంలో తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడటం, పుస్తకాలు చదవడం వంటిని చేస్తున్నట్లు చెప్పారు. గడచిన వారం రోజులుగా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నానని..మరికొన్ని రోజులు ఇక్కడే గడుపుతానని డా.నాయక్‌ తెలిపారు. మొదట్లో రాష్ట్రంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఈ మధ్యే వైరస్‌ తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

తాజాగా ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇది చూసిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ డా.నాయక్‌ను ప్రశంసించారు. కరోనా వైరస్‌పై చేస్తున్న ఈ పోరాటంలో మీలాంటి యోధులకు ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న స్ఫూర్తికి వందనం అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే తొందరలోనే కరోనాపై విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లో కరోనా తీవ్రత పెరుగుతోంది. బుధవారం నాటికి రాష్ట్రంలో 229 మంది కరోనా బారినపడగా..వీరిలో 16మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని