కరోనా అదుపులోకి వచ్చేవరకు విమానాలు బంద్!

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర సేవలు మినహా ప్రపంచవ్యాప్తంగా విమానయానం మూగబోయింది

Published : 08 Apr 2020 20:20 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర సేవలు మినహా ప్రపంచవ్యాప్తంగా విమానయానం మూగబోయింది. అయితే భారత్‌లో కరోనా వైరస్‌ తీవత్ర తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి వెల్లడించారు. అప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహకరిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 30వరకు అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది.

ఏప్రిల్‌ 14నాటికి లాక్‌డౌన్‌ ముగియాల్సి ఉన్నప్పటికీ మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ పొడగింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే కరోనా తీవ్రత, దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని