
1.7 కోట్ల పీపీఈలకు ఆర్డర్: కేంద్రం
దిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 17 మరణాలు సంభవించాయని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 166కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 5,734కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 473 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఈ మేరకు సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొవిడ్-19 రోగులకు వైద్య అందించే సిబ్బంది కోసం 1.7 కోట్ల వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈలు) ఆర్డర్ చేసినట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. దేశీయంగా 20 మంది తయారీదారులు వీటిని ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు. వీటి సరఫరా కూడా ప్రారంభమైందని తెలిపారు. వీటితోపాటు 49 వేల వెంటిలేటర్లకు కూడా ఆర్డర్ చేశామని తెలిపారు. పీపీఈల విషయంలో రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా కిట్లు సరఫరా చేస్తామని కేంద్రం తరఫున భరోసా ఇచ్చారు. కొవిడ్-19పై పోరుకు 3,250 రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ యూనిట్లుగా మార్చినట్లు తెలిపారు. మొత్తం 5వేల కోచ్‌లను మార్పు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు లక్షా 30 వేల శాంపిళ్లను పరీక్షించామని, వీటిలో 5,734 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధికారి వెల్లడించారు. గత నెల, నెలన్నరగా చేపడుతున్న శాంపిళ్లలో 3 నుంచి 5 శాతం మందికే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే 13,143 శాంపిళ్లను పరీక్షించామని చెప్పారు.