మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని కృతజ్ఞతలు

కీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలను పంపుతున్న భారత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్‌-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు......

Published : 10 Apr 2020 08:46 IST

దిల్లీ: కీలక సమయంలో ప్రపంచ దేశాలకు అవసరమైన ఔషధాలను పంపుతున్న భారత్‌కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. కొవిడ్‌-19 చికిత్సలో ఆశాజనక ఫలితాలు ఇస్తుందన్న మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపినందుకు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాలు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. తాజాగా ఈ జాబితాలో ఇజ్రాయెల్‌ కూడా చేరింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ.. మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇజ్రాయెల్‌కు క్లోరోక్విన్‌ పంపినందుకు భారత ప్రధాని, నా ఆప్తమిత్రుడు మోదీకి ధన్యవాదాలు. ఇజ్రాయెల్‌ పౌరులంతా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి నేను మోదీతో తరచూ చర్చిస్తున్నాను. పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాం’’ అని నెతన్యాహూ ట్వీట్‌ చేశారు.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేసే పదార్థాలు సహా మరికొన్ని ప్రాణాధార ఔషధాలతో ఎయిరిండియా విమానం మంగళవారం ఇజ్రాయెల్‌కు చేరింది. దాదాపు ఐదు టన్నుల మందుల్ని అందించినట్లు అధికారిక సమాచారం. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు 10వేల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 86 మంది మృత్యువాతపడగా.. 121 మంది ఐసీయూ ఉన్నారు.

 

ఇవీ చదవండి..

ఔషధ దౌత్యం

కరోనాపై కప్పదాటు ధోరణి: డబ్ల్యూహెచ్‌ఓ వివాదాస్పద సరళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని