ఈ సంక్షోభంలో ఉగ్రదాడులకు అవకాశం: ఐరాస

అంతర్జాతీయ శాంతిభద్రతలకు కరోనా వైరస్‌ మహమ్మారి పెను ముప్పుగా పరిణమించిందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 21 Dec 2022 16:10 IST

ఆందోళన వ్యక్తం చేసిన ఆంటోనియో గుటెరస్‌

వాషింగ్టన్‌: అంతర్జాతీయ శాంతిభద్రతలకు కరోనా వైరస్‌ మహమ్మారి పెను ముప్పుగా మారే అవకాశముందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక అశాంతి అల్లర్లకు దారితీసి, దాని మీద పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఐరాస భద్రతా మండలిని ఆయన హెచ్చరించారు. కొద్ది నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఈ మహమ్మారిపై ఐరాసలో కీలక విభాగమైన భద్రతామండలి ఇంతవరకు నోరు మెదపలేదు. అయితే తాజాగా జరిగిన సమావేశం అనంతరం ప్రస్తుత సంక్షోభాన్ని భద్రతకు ముప్పుగా గుర్తిస్తూ ఓ  మీడియా ప్రకటనను విడుదల చేసింది. కరోనా మహమ్మారితో ప్రభావితమైన దేశాలకు సంఘీభావం తెలపడంతో పాటు దాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన కార్యదర్శి తీసుకుంటున్న అన్ని చర్యలకు మద్దతు తెలుపుతామని దానిలో పేర్కొంది.

ఈ సమావేశం సందర్భంగా గుటెరస్‌ మాట్లాడుతూ..‘ప్రభుత్వ రంగ సంస్థలు విశ్వసనీయత కోల్పోవడం, ఆర్థిక అస్థిరత్వం, ఎన్నికలు వాయిదా పడటంతో వచ్చే రాజకీయ ఉద్రిక్తతలు, అనిశ్చితి కారణంగా కొన్నిదేశాల్లో ఏర్పడే గందరగోళం.. కొవిడ్‌ 19 వంటి అనిశ్చిత పరిస్థితులను ఉపయోగించుకొని ఉగ్రవాదులు జీవ సంబంధ దాడులకు పాల్పడే ముప్పు పొంచి ఉంది’ అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవ హక్కుల పరిరక్షణకు తీవ్ర సవాలుగా మారనుందన్నారు. శాంతిభద్రతలకు సంబంధించిన ఇబ్బందికర పరిస్థితులను తగ్గించడానికి మండలి చర్యలు కీలకం కానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో అది చూపించే ఐక్యత, సంకల్పం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలకు అడ్డుకట్ట వేయాలని గుటెరస్‌ మార్చి 23న పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని