టెస్టుల్లో చిక్కని కరోనా‌ వైరస్‌?

మానవాళికే సవాల్‌ విసురుతున్న కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక కొవిడ్‌-19 కారణంగా అమెరికాలో వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడటం కలవరపెడుతోంది.

Published : 13 Apr 2020 00:45 IST

నిర్ధారణ పరీక్షలపై నిపుణుల హెచ్చరిక!


వాషింగ్టన్‌: మానవాళికే సవాల్‌ విసురుతున్న కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక కొవిడ్‌-19 కారణంగా అమెరికాలో వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడటం కలవరపెడుతోంది. ఇంతభారీ స్థాయిలో జరుగుతున్న మరణాలకుగల కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. అయితే ఈ వైరస్‌ను వ్యాప్తిని అరికట్టడంలో అసలు దీన్ని గుర్తించడమే అత్యంత కీలకం. దీనికోసం కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తులతోపాటు అనుమానితులకు కూడా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని సమయాల్లో వైరస్‌ ఉన్నవ్యక్తుల్లో లక్షణాలు బయటపడకపోవడం చూశాం. తాజాగా వైరస్‌ ఉన్న వ్యక్తులకు నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఫలితం నెగిటివ్‌ వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిణామంతో వైరస్‌ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష విధానం ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు.

కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పీసీఆర్‌(పాలీమెరేస్‌ చైన్‌ రియాక్షన్‌) పరిజ్ఞానాన్ని అనుసరిస్తున్నారు. ఈ స్వాబ్‌ విధానం ద్వారా అతిసూక్ష్మమైన నమూనాలను వ్యక్తి ముక్కు, గొంతు నుంచి సేకరించి ల్యాబ్‌కు పంపుతారు. అత్యంత కీలకమైన ఈ దశలో..నమూనాలు సేకరించే సమయంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. తుమ్మడం, దగ్గడం ద్వారా ఎంత బయటకు వస్తోంది?, వీటిని సేకరించడం, పరీక్షలకోసం తరలించే సమయం వంటి అంశాలు ఫలితంపై ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. గడచిన నాలుగునెలలుగా ప్రపంచదేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ కేవలం వ్యక్తుల మధ్యే సంక్రమిస్తున్నదని పలు నివేదికలు స్పష్టంచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ప్రస్తుతం అనుసరిస్తున్న కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు ప్రాథమికమైనవిగానే భావించాలని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణురాలు ప్రియా సంపత్‌ అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ ఉన్న వ్యక్తుల్లో కేవలం 60నుంచి 70శాతం మాత్రమే పాజిటివ్‌గా బయటపడుతున్నట్లు చైనా నివేదికలు సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవేళ దీన్ని 90శాతానికి పెంచిగలిగితే పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. నిర్ధారణ పరీక్ష కచ్చితంగా లేనట్లయితే ఒక్కశాతం తప్పుగా సూచించే కేసులు కూడా కొత్తగా వేల పాజిటివ్‌ కేసులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే క్లినికల్‌ డయాగ్నసిస్‌ ఎంతో కీలకమని సూచిస్తున్నారు. ఈ సమయంలో కేవలం శాంపిల్స్‌ తీసుకోవడమే కాకుండా రోగి లక్షణాలు, ఆరోగ్య చరిత్ర, ఇమేజింగ్‌తో పాటు మరిన్ని పరీక్షలు నిర్వహించమే ఉత్తమమని అంటున్నారు. అత్యంత కీలకమైన ఈ నమూనాల సేకరణలో శ్వాసకోస భాగాల నుంచి తీసుకునేవారికి నైపుణ్యం ఉండాలి. అంతేకాకుండా కచ్చితమైన నమూనాలు తీసుకున్నప్పటికీ పరీక్ష నిర్వహించడంలో జరిగే పద్ధతులవలన ఫలితాల్లో తేడాలొచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం రోగి నుంచి కఫం వంటి నమూనాలు సేకరించడం ఉత్తమమైందని సూచిస్తున్నారు. 

అమెరికాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా లక్షల సంఖ్యలో ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. నైపుణ్యం లేనివారు, ఫార్మసిస్టులు కూడా చేసే ఈ ప్రక్రియలో కొంత తేడా వచ్చినా కరోనా సోకిన వారిని గుర్తించడం కష్టంగా మారుతుంది. నిర్ధారణ పరీక్షలో ఉన్న లోపాలతో వైరస్‌ ఉన్న వ్యక్తికి నెగిటివ్‌ నివేదిక ఇచ్చినట్లయితే అతను వైరస్‌ సోకలేదనే భావనతో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో అతని నుంచి మరింతమందికి వైరస్‌ సోకే ఆస్కారం ఉంటుందని జాన్‌ హాప్‌కిన్స్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు డేనియల్‌  బ్రెన్నెర్ హెచ్చరిస్తున్నారు. 

ఈ సమయంలో కేవలం స్వాబ్‌ పరీక్షలే సరిపోవని కొత్తగా సెరొలాజికల్‌ పద్ధతి మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్తనామూనాలు తీసుకుని చేసే ఈ పద్ధతి ద్వారా ఓ వ్యక్తి ఇదివరకు వైరస్‌ బారిన పడ్డాడా?లేదా అనే విషయం కచ్చితంగా తెలుస్తుందంటున్నారు. దీనికోసం అమెరికా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ప్రియా సంపత్‌ వెల్లడించారు. ఏదేమైనా కరోనా నిర్ధారణ పరీక్షలు కచ్చితంగా చేసినపుడే వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని