అప్పుడే హెచ్చరించారు..

కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోతుంది. ఆదివారం నాటికి దాదాపు ఐదు లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. అయితే ఈ పరిస్థితి కారణం అధ్యక్షుడి వైఖరేనట. వైరస్‌ విజృంభణ గురించి అక్కడి అధికారులు...... 

Updated : 13 Apr 2020 07:59 IST

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోతోంది. ఆదివారం నాటికి దాదాపు ఐదు లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. అయితే ఈ పరిస్థితి కారణం అధ్యక్షుడి వైఖరేనట. వైరస్‌ విజృంభణ గురించి అక్కడి అధికారులు ముందే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హెచ్చరించారట. అయినప్పటికీ  ఆయన వారి సూచనలను పట్టించుకోకుండా, కేవలం ఆర్థిక వ్యవస్థ లాభాలపై దృష్టి సారించటం వల్లనే అమెరికాలో వైరస్‌ తీవ్రత ఎక్కువయిందని స్థానిక పత్రిక పేర్కొంది. ఈ మేరకు ప్రముఖ అమెరికన్‌ వార్తా పత్రిక ద న్యూయార్క్‌ టైమ్స్ ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.

కరోనా వైరస్‌ ప్రారంభ దశలోనే అమెరికన్‌ ఇంటలిజెన్స్, జాతీయ భద్రత వర్గాలు, ప్రభుత్వ ఆరోగ్య అధికారులతో పాటు అన్ని కేబినెట్ విభాగాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధ్యక్షుడిని హెచ్చరించాయట. అయితే ట్రంప్ వాటన్నింటినీ పెడచెవిన పెట్టడంతో పరిస్థితి ఇక్కడి వరకు వచ్చినట్లు కథనంలో పేర్కొన్నారు. ‘‘మహమ్మారి విజృంభణ గురించి అధ్యక్షుడికి ముందే సమాచారం అందించారు. అయితే ఆయన అంతర్గత విభాగాల పనితీరు, వైరస్‌ను అడ్డుకునేందుకు సరైన ప్రణాళిక లేకపోవడం, రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించడం వంటి పలు కారణాల వల్ల  ఎక్కువమంది వైరస్‌ బారిన పడ్డారు’’ అని న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడించింది. 

జనవరి నెల మొదట్లో అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్ వర్గాలకు చైనాలోని వుహాన్ నగరంలో ప్రమాదకరమైన కొత్త వైరస్ వ్యాపిస్తుందనే దాని గురించి సమాచారం అందిందట. దీంతో కొద్ది వారాల తర్వాత జాతీయ భద్రతా కౌన్సిల్‌లోని బయో డిఫెన్స్‌ వర్గాలకు వైరస్‌ తీవ్రతను అంచనా వేసే బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాతే ప్రజలను క్వారంటైన్‌లో ఉంచడం, ఇళ్ల వద్దనే నుంచే పని చేయాలని సూచించారు. అయితే అప్పటికే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖ్యమైన మూడు వారాల సమయాన్ని అమెరికా దాటేసిందని పత్రిక తన కథనంలో పేర్కొంది. ఆ సమయంలో ట్రంప్‌ చైనాతో ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం గురించి జరపాల్సి ఉండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారని కథనంలో ప్రచురించారు. దీనిపై ట్రంప్‌ ముఖ్య వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో జనవరి చివర్లో ఒక లేఖ రాశారట. వైరస్ కారణంగా అమెరికాలో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అమెరికా కోల్పోతుందని ఆయన అందులో పేర్కొన్నారట. దాదాపు 30 శాతం మంది అమెరికా జనాభా వైరస్‌ బారిన పడతారని లేఖలో హెచ్చరించినట్లు తెలిపారు.

అయితే వైరస్ తీవ్రత రోజు రోజుకీ ఎక్కువవుతుండటంతో పిభ్రవరి మూడోవారంలో ప్రజారోగ్య అధికారులు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సామాజిక దూరం, ఇళ్లకే పరిమితం కావడం వంటి సూచనలు జారీ చేశారు. అంతే కాకుండా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన ప్రణాళికలు అధ్యక్షుడితో పంచుకునే అవకాశం రాలేదని, అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌ తన ప్రజారోగ్య సలహాదారుని పక్కకు పెట్టి, ఉపాధ్యక్షుడు మైక్ పాంపియోకు వైరస్‌ కట్టడి బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమయిందని వెల్లడించారు. అప్పటికే వైరస్‌పై స్పందించే విషయంలో వైట్‌హౌస్ రెండు వర్గాలుగా చీలిపోయిందట. రోజు రోజుకీ వైరస్ తీవ్రత ఎక్కువతుండటంతో ట్రంప్ అందరిని కలుపుకుపోయే ధోరణిలో వ్యవహరించడంతో పరిస్థితిలో కొంత మార్పు చోటుచేసుకుందని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని