వ్యాక్సిన్‌ వచ్చేవరకూ వైరస్‌ ముప్పు!: WHO

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ముప్పునుంచి మానవాళి బయటపడే అవకాశాలు ఇప్పట్లో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది.

Updated : 13 Apr 2020 13:36 IST

ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ముప్పునుంచి మానవాళి బయటపడే అవకాశాలు ఇప్పట్లో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ వైరస్‌ ముప్పు పొంచివుందని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి డా.డేవిడ్‌ నాబర్రో అంచనా వేశారు. వైరస్‌కు విరుగుడు(వ్యాక్సిన్‌) వచ్చేంతవరకూ ఈ వైరస్‌ మనల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజాగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కొంతకాలం పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ..మళ్లీ తిరిగి విజృంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సమయంలో వైరస్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, లక్షణాలున్న వారిని వెంటనే ఐసోలేట్‌ చేసే పద్దతి కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. దీనికి ప్రపంచ దేశాలు సన్నద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.

మరికొన్ని రోజుల్లో వైరస్‌ ప్రభావం తగ్గుతుందని అమెరికాతోపాటు ఇతర దేశాలు అంచనా వేస్తున్న నేపథ్యంలో డేవిడ్‌ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంటికే పరిమితం కావాలని విధించిన ఆంక్షలు సడలిస్తామని చేస్తున్న ప్రకటనలపై ఆయాదేశాలు పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తామన్న ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి స్పందించారు. అమెరికాతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే జరిగితే చాలా దురదృష్టకరం అని డేవిడ్‌ నాబర్రో అభిప్రాయపడ్డారు. కాగా ప్రతి సంవత్సరం అమెరికా 500మిలియన్‌ డాలర్ల నిధులను ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమకూరుస్తోంది.

ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18లక్షల మందికి సోకిన కరోనా వైరస్‌ కారణంగా లక్షా పదివేల మంది మృత్యువాతపడ్డారు. కేవలం అమెరికాలోనే 20వేల మంది చనిపోగా మరో ఐదు లక్షలకుపైగా అమెరికన్లు ఈవైరస్‌ బారినపడ్డారు.

ఇవీ చదవండి..

అమెరికాలో 24 గంటల్లో 1514 మరణాలు..

భారత్‌లో 300దాటిన కరోనా మరణాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని