ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏం చేస్తుందంటే..

ప్రపంచ ఆరోగ్యసంస్థకు నిధులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచంలో సంచలనం కలిగించింది. బిలిగేట్స్‌తో పాటు అనేక దేశాలు ఈ చర్య తగదన్నాయి. అయితే చైనాలో ప్రారంభమైన మహమ్మారి కరోనా గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో ఆరోగ్యసంస్థ...

Published : 15 Apr 2020 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : ప్రపంచ ఆరోగ్యసంస్థకు నిధులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచంలో సంచలనం సృష్టించింది. బిల్‌గేట్స్‌తో పాటు అనేక దేశాలు ఈ చర్య తగదన్నాయి. అయితే చైనాలో ప్రారంభమైన మహమ్మారి కరోనా గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో ఆరోగ్యసంస్థ విఫలమైందన్నది అమెరికా ఆరోపణ. దీంతో పాటు చైనా వైపు పక్షపాత ధోరణితో వ్యవహరించిందని అమెరికా.. తదితర దేశాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచంలో ఐరాస సభ్యత్యమున్న దేశాలతో పాటు ఇతర దేశాల్లోనూ ఆరోగ్యసంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వ్యాధుల సంక్రమణ, కొత్తవ్యాధులపై హెచ్చరికలతో పాటు పలు దేశాల్లోని పరిశోధకులతో కలిసి అనేక వ్యాధులపై పరిశోధనలు నిర్వహిస్తోంది. 

1948లో స్థాపన

1945 ఐరాసలో పాల్గొన్న దేశాలు ఆరోగ్యపరిరక్షణకు ఒక అంతర్జాతీయ సంస్థ ఉండాలని తీర్మానించాయి. వీరి ఆశయాలకు అనుగుణంగా 1948 ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్యసంస్థను ఏర్పాటు చేశారు.ఐక్యరాజ్యసమితిలో ప్రత్యేక ఏజన్సీగా దీన్ని స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారు. 

ఎన్నో సేవలు..

ప్రపంచంలోని ఏ దేశంలోనైనా కొత్త వ్యాధులు తలెత్తితే వెంటనే వైద్యబృందాలను పంపించి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది.  సంక్రమణ వ్యాధుల నుంచి ఎయిడ్స్‌.. లాంటి తీవ్రమైన వ్యాధుల నివారణకు ఎన్నో పరిశోధనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రపంచదేశాలను హెచ్చరించడంలో విఫలమైందని అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది. జనవరిలోనూ సైతం వ్యాధి తీవ్రతను తక్కువగా అంచనా వేసిందని  అమెరికా వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

నిధుల నిలిపివేత తగదు..

అయితే ఈ కారణాలను చూపి సాయాన్ని నిలిపివేయడం తగదని పలువురు వైద్యశాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యసంస్థకు భారీ సాయం చేసే దేశాల్లో అమెరికా ఒకటని నిధుల నిలిపివేతతో పలు పరిశోధనలు ఆగిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌పై జరుపుతున్న పోరాటానికి కూడా అడ్డంకులు ఏర్పడే ప్రమాదముందని వారు అన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థకు 5 బిలియన్ల అమెరికన్‌ డాలర్లకు పైగా బడ్జెట్‌ ఉంది. ఇందులో అమెరికా దాదాపు 900 మిలియన్లను విరాళంగా ఇస్తోంది. అమెరికా నుంచి ఆగిపోతే పలుదేశాల్లో ఆరోగ్య కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడే  అవకాశముందని వైద్యవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో దీనికి ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ఆసియాకు సంబంధించి దిల్లీలోనే ప్రాంతీయ కార్యాలయముంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని