ఇక రెండు గంటల్లోనే కొవిడ్‌-19 నిర్ధారణ?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో ఈ వైరస్‌ను గుర్తించడమే అత్యంత కీలకం. వైరస్‌ను ఎంత తొందరగా నిర్ధారిస్తే అంత ఎక్కువగా దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే వైరస్‌ నిర్ధారణ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.

Published : 17 Apr 2020 16:09 IST

తిరువనంతపురం: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో ఈ వైరస్‌ను గుర్తించడమే అత్యంత కీలకం. వైరస్‌ను ఎంత తొందరగా నిర్ధారిస్తే అంత ఎక్కువగా దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సమయంలోనే వైరస్‌ నిర్ధారణ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా కేవలం రెండు గంటల్లోనే వైరస్‌ను నిర్ధారించే సాంకేతికతను రూపొందించింది కేరళకు చెందిన ఓ సంస్థ. అంతేకాదు తక్కువ సమయంతో పాటు తక్కువ ధరకే ఈ నిర్ధారణ పరీక్ష సాధ్యమంటోంది. 

తిరువనంతపురానికి చెందిన ‘చిత్రా తిరుణాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్స్‌’ కేవలం రెండు గంటల్లోనే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష ఫలితాన్నిచ్చే సాంకేతికతను రూపొందించింది. కొవిడ్-19 కు కారణమయ్యే SARS-CoV-2ని రెండు గంట్లోనే గుర్తించే ఈ పరీక్షకు కేవలం వెయి రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతోంది. అయితే దీనికి ఇంకా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) అనుమతి లభించాల్సి ఉంది.

ప్రస్తుతం భారత్‌తోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు కొవిడ్-19 నిర్ధారణ కోసం RT-PCR పద్ధతిని అనుసరిస్తున్నారు. స్వాబ్‌ ద్వారా(ముక్కు, గొంతు భాగాల నుంచి) నమూనాలు సేకరించి పరీక్షించే ఈ విధానంలో తుది ఫలితం కోసం దాదాపు ఐదు గంటలు పడుతోంది. అంతేకాకుండా ఖర్చుతో కూడకున్న పని. ప్రస్తుతం ఈ పరీక్ష చేయడానికి రూ.4500 వసూలు చేస్తున్నారు. అయితే కొత్తగా రూపొందించిన ఈ సాంకేతికతలో RT-LAMP పద్ధతిని ఉపయోగిస్తామని దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానం కన్నా ఇది ఎంతో త్వరగా కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుందని తెలిపింది. తద్వారా తక్కువ సమయంలో ఎక్కవ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి అలెప్పీలోని జాతీయ వైరాలజీ కేంద్రంలో ఈ కిట్లు ధ్రువీకరణ పొందగా ఐసీఎంఆర్‌ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అనుమతి లభించిన అనంతరం సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) నుంచి లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం వినియోగిస్తోన్న PCR సాంకేతికలో ఉపయోగించే మిషన్‌ ఖరీదు 15 నుంచి 30 లక్షలు ఉండగా.. ఈ కొత్త టెక్నాలజీలో దీని ఖర్చు రెండున్నర లక్షలేనని సదరు సంస్థ పేర్కొంది. ఏదేమైనా ఇలాంటి సాంకేతికత అందుబాటులోకి రావడం వలన ఎక్కవ సంఖ్యలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని