అంత్యక్రియలకు  50వేలకు పైగా హాజరు

దేశమంతటా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ ఓ మతపెద్ద అంత్యక్రియలకు 50వేలకు పైగా ప్రజలు హాజరవ్వడంతో బంగ్లాదేశ్‌ ఉలిక్కిపడింది. ఊహించని రీతిలో ప్రజలు రావడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. బంగ్లాదేశ్‌లో 2,144 మందికి కొవిడ్‌-19 సోకగా 84 మంది మృతిచెందారు....

Updated : 19 Apr 2020 00:47 IST

ఊహించని పరిస్థితితో  బంగ్లాదేశ్‌ ఉలిక్కిపాటు

ఢాకా: దేశమంతటా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ ఓ మతపెద్ద అంత్యక్రియలకు 50వేలకు పైగా ప్రజలు హాజరవ్వడంతో బంగ్లాదేశ్‌ ఉలిక్కిపడింది. ఊహించని రీతిలో ప్రజలు రావడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. బంగ్లాదేశ్‌లో 2,144 మందికి కొవిడ్‌-19 సోకగా 84 మంది మృతిచెందారు.

బంగ్లాదేశ్‌ ఖలీఫత్‌ మజ్లిస్‌ నయీబ్‌ ఈ ఆమిరైన మౌలానా జుబెయిర్‌ అహ్మద్‌ అన్సారీ (55) శుక్రవారం సరైల్‌ ఉపజిలాలోని బెర్తెలా గ్రామంలో మరణించారు. స్థానిక మదర్సాలో శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేనప్పటికీ ఢాకా సహా వేర్వేరు ప్రాంతాల నుంచి అనూహ్యంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది. ‘ప్రభుత్వం నిర్దేశించిన సోషల్‌ డిస్టెన్సింగ్‌ను పట్టించుకోకుండా శనివారం ఉదయం దాదాపు 50వేల మంది హాజరయ్యారు’ అని ఆ వార్తా సంస్థ పేర్కొంది.

దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే వేలాది మంది అంత్యక్రియలకు హాజరవ్వడంతో అధికారులు, ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం గుమిగూడటాన్ని నిషేధించనప్పుడు ఈ అంత్యక్రియలు జరిగాయి’ అని ఆ జిల్లా కరోనా వైరస్‌ నియంత్రణ కమిటీ సభ్యుడు అల్‌ మమున్‌ సర్కార్‌ అన్నారు. ‘ ప్రజలు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాంటప్పుడు వేలాది మంది హాజరవ్వడం నా ఊహాకు అందడం లేదు’ అని జిల్లా సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఇక్రమ్‌ ఉల్లా పేర్కొన్నారు. ఇంతమంది వస్తారని తాము ఊహించలేదని, ప్రజలు గుమిగూడకుండా తామేం చేయలేకపోయాని స్థానిక పోలీసులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు