
కరోనాపై పోరులో మాకూ అవకాశం ఇవ్వండి
ప్రభుత్వాన్ని కోరిన పాక్ హిందూ శరణార్థ వైద్యులు
జోధ్‌పుర్: కరోనాపై పోరులో మేము సైతం భాగస్వాములం అవుతామంటున్నారు పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన హిందూ వైద్యులు. అందుకు వారికి అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పట్టాపొందిన వారు భారత మెడికల్ కౌన్సిన్ (ఎంసీఐ) నిర్వహించే బ్రిడ్జి పరీక్షలో పాసయ్యేంతవరకు వారు భారత్‌లో ఎలాంటి వైద్యం అందించకూడదనే నిబంధనలు ఉన్నాయి. దేశంలో కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో వైరస్ సోకిన రోగులకు వైద్యం అందించేందుకు తమకు అవకాశం కల్పించాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై పలువురు శరణార్థ వైద్యులు వారి అభిప్రాయాలను వెల్లడించారు.
‘విదేశాల్లో ఎంబీబీఎస్ పట్టా పొందినవారు భారత మెడికల్ కౌన్సిన్ నిర్వహించే పరీక్షలో పాసవ్వాలనే కచ్చితమైన నిబంధన ఉంది. ఆ నిబంధనతో దాదాపు 300 మంది వైద్యులు భారత్‌లో ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని మమ్మల్ని అర్హత కలిగిన వైద్యులుగా గుర్తిస్తే, మేం సైతం కరోనా బాధితులకు వైద్యం అందిస్తాం’ అని కరాచీలోని సింధ్ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొంది, 20 ఏళ్ల క్రితం భారత్‌కు వలస వచ్చిన ఎమ్ఎల్ జంగిద్ పేర్కొన్నారు.
‘భారత్‌కు వచ్చిన తర్వాత ఇక్కడి పౌరసత్వం పొందేందుకు దాదాపు 11 సంవత్సరాలు పట్టింది. పౌరసత్వం పొందిన అనంతరం ఎంసీఐ నిర్వహించే పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ వయసు, ఇతర కారణాలతో చాలామంది ఆ పరీక్షకు హాజరు కాలేకపోతున్నారు’ అని పాకిస్థాన్‌లోని హైదరాబాద్ వైద్య కళాశాలలో పట్టా పొంది 2007లో భారత్‌కు వచ్చిన మరో వైద్యుడు అనిల్ శార్ద తెలిపారు.
2000 సంవత్సరం తర్వాత 300లకు పైగా భారత్‌కు వలసవచ్చిన పాక్ హిందూ శరణార్థ వైద్యుల పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీమంత్ లోక్ సంఘ్తన్ అధ్యక్షుడు హిందు సింగ్ సోధ పేర్కొన్నారు. కొద్ది సంవత్సరాలుగా ఈ విషయాన్ని హోం శాఖ, వైద్యారోగ్య శాఖ, న్యాయ శాఖ దృష్టికి తీసుకెళుతున్నట్లు వెల్లడించారు. ఈ విపత్కర సమయంలో అర్హత, అనుభవం కలిగిన పాక్ హిందూ శరణార్థ వైద్యులకు అవకాశం కల్పించి భయంకరమైన వైరస్‌తో పోరాడుతున్న రోగులను కాపాడాలని సోధ ప్రభుత్వాన్ని కోరారు.