ముందు మీ సంగతి చూసుకోండి

సరిహద్దు ఉగ్రవాదాన్ని మొదట అరికట్టాలంటూ పాకిస్థాన్‌కు భారత్‌ ఈ సందర్భంగా హితవు పలికింది.

Published : 20 Apr 2020 15:30 IST

ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్‌

దిల్లీ: మైనారిటీలపై భారత్‌ పక్షపాత వైఖరిని అవలంబిస్తోందన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇది, పాక్‌ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించటానికి ఆ ప్రభుత్వం చేస్తున్న అసంబద్ధమైన ప్రయత్నమని భారత్‌ పేర్కొంది.‘‘తమ కొవిడ్‌-19 విధానంపై చెలరేగుతున్న విమర్శల నుంచి తప్పించుకొనేందుకు మోదీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వక, హింసాత్మక వైఖరిని అవలంబిస్తోంది. దీనితో వేల మంది ఆకలితో, నిరాశ్రయులై భాధపడుతున్నారు. ఇది జర్మనీలో నాజీలు యూదులపై అవలంబించిన విధానం మాదిరిగా ఉంది. ఇది మోదీ ప్రభుత్వ హిందుత్వ విధానానికి మరో ఉదాహరణ’’ ఇటీవల పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్ ట్విటర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఇందుకు విదేశీ వ్యవహారాలశాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ స్పందిస్తూ... ‘‘పాక్‌ నాయకత్వం వారి అంతర్గత సమస్యలను ఎదుర్కోవటంతో విఫలమైంది. కొవిడ్‌-19ను ఏ విధంగా నివారించాలి అనే అంశంపై దృష్టి సారించటం మాని... పొరుగు దేశాలపై ఈ విధంగా ఆధారంలేని ఆరోపణలకు దిగుతోంది’’ అని జవాబిచ్చారు. పాక్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులను గురించి మాట్లాడుతూ... ‘‘ఇక మైనారిటీల విషయానికి వస్తే... వారి దేశంలో ఉన్న మైనారిటీలే నిజంగా వివక్షకు గురవుతున్నారు. కనుక పాక్‌ ప్రభుత్వం వారి కష్టాల పట్ల శ్రద్ధ వహిస్తే బాగుంటుంది.’’ అని శ్రీవాత్సవ తిప్పికొట్టారు.

దేశంలోని ముస్లింల పట్ల భారత ప్రభుత్వ వైఖరిపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల అదేపనిగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధమైన పాక్‌ వైఖరి భారత అంతర్గత వ్యవహారంలో అనవసర జోక్యమేనని భారత్‌ దీటుగా జవాబిస్తూ వస్తోంది. అంతేకాకుండా, పాక్‌ గడ్డపై పుట్టి పొరుగు దేశాల్లో విస్తరిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని మొదట అరికట్టాలంటూ పాకిస్థాన్‌కు భారత్‌ ఈ సందర్భంగా హితవు పలికింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని