వాహనాన్ని ఆపినందుకు పోలీసుతోనే గుంజీళ్లు

ఓ ప్రభుత్వ అధికారి వాహనం ఆపడమే ఆ పోలీసు చేసిన తప్పిదమయ్యింది. ఫలితంగా ఆ అధికారి పోలీసుతో గుంజీలు తీయించాడు. అంతేకాదు క్షమాపణలు కూడా చెప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో..

Published : 21 Apr 2020 19:22 IST

దర్యాప్తునకు ఆదేశించిన సూపరింటెండెంట్‌

పట్నా: ఓ ప్రభుత్వ అధికారి వాహనం ఆపడమే ఆ పోలీసు చేసిన తప్పిదమైంది. ఫలితంగా ఆ అధికారి పోలీసుతో గుంజీళ్లు తీయించాడు. అంతేకాదు క్షమాపణలు కూడా చెప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని అరారియా జిల్లాలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బైర్‌గాచి చౌక్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా సోమవారం సాయంత్రం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు చౌకిదార్‌ గణేష్‌ తాత్మ.. జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) మనోజ్‌ కుమార్‌ వాహనాన్ని ఆపాడు. దీంతో కోపోద్రిక్తుడైన డీఏఓ కారులో నుంచి కిందకు దిగి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు హడావిడిగా వెళుతున్నాను. లేదంటే నిన్ను జైల్లో వేయించేవాడిని అని చౌకిదార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం ఇతర పోలీసుల ముందే రెండు చెవులు పట్టుకొని గుంజీళ్లు తీయాలని హుకూం జారీ చేశాడు. గుంజీళ్లు తీసిన అనంతరం అతడితో క్షమాపణ కూడా చెప్పించుకున్నాడు. కాగా ఈ సంఘటన జరుగుతున్నంతసేపు అక్కడే ఉన్న సీనియర్‌ పోలీసు అధికారి డీఏఓకు భయపడి అతడికే మద్దతు తెలిపి.. గణేష్‌ తాత్మపై చిర్రుబురులాడటం గమనార్హం. విషయం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ దురత్‌ సయాలి దృష్టికి వెళ్లగా ఆయన దర్యాప్తునకు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని