కరోనా వైరస్‌ చైనాలో ఎక్కడ, ఎలా తయారు చేశారో..

ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎక్కడ, ఎలా అభివృద్ధి చేశారో ‘అసలైన ఆధారాల’తో చైనా ముందుకు రావాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రెయిన్‌ అన్నారు. ప్రస్తుతం ఆ దేశంపైనే ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు....

Updated : 13 May 2022 14:59 IST

‘అసలైన ఆధారాల’తో  చెప్పాలి: అమెరికా ఎన్‌ఎస్‌ఏ

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎక్కడ, ఎలా అభివృద్ధి చేశారో ‘అసలైన ఆధారాల’తో చైనా ముందుకు రావాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రెయిన్‌ అన్నారు. ప్రస్తుతం ఆ దేశంపైనే ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికి సోకిన కొవిడ్‌-19ను కట్టడి చేయడంలో పారదర్శకంగా వ్యవహరించలేదని ప్రపంచ దేశాల నుంచి చైనాపై ఒత్తిడి నెలకొంది. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ వైరస్‌ వుహాన్‌లోని ప్రయోగశాల లేదా మాంసాహార విపణిలో పుట్టిందని భావిస్తున్న సంగతి తెలిసిందే. ‘వైరస్‌ ఎక్కడ తయారైందో నిజమైన ఆధారాలతో ముందుకు రావాల్సిన ఒత్తిడి చైనాపై ఉంది’అని ఓబ్రెయిన్‌ మీడియాతో అన్నారు.

‘కొందరు చైనా పౌరులు, ప్రజావేగులు మాయమయ్యారు. మీడియాను తరిమేశారు. విదేశాల నుంచి వ్యాధి నియంత్రణ నిపుణుల బృందం వచ్చి పరిశీలిస్తామంటే చైనా తిరస్కరించింది. అందుకే వైరస్‌ ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాల్సిన భారం చైనా పైనే పడింది. వాళ్లు ఎలా ముందుకొస్తారో చూడాల్సి ఉంది’ అని ఓబ్రెయిన్‌ అన్నారు.

‘చూడండి, అక్కడ రెండు ప్రయోగశాలలు ఉన్నాయి. అడవి జంతువుల మాంసాహార విపణి ఉంది. చైనాపై ఇప్పటికే చాలామంది నష్ట పరిహారం కోసం దావాలు వేశారు. అమెరికా సహా మరికొన్ని ప్రభుత్వాలు చైనాను బాధ్యురాలిని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

‘వైరస్‌ ఒకవేళ ప్రయోగశాల నుంచి వచ్చిందా లేదా మాంసాహార విపణి నుంచి వచ్చిందా.. ఏదైనా సరే అందులో ఒకటి మంచి కథే అవుతుంది. నా ఉద్దేశం ఆ మాంసాహార విపణిలో భయంకరమైన అడవి జంతువులను అమ్ముతారు. రసంలో గబ్బిలాలను వేస్తారు’ అని ఓబ్రెయిన్‌ విరుచుకుపడ్డారు.

‘చైనీయులు వుహాన్‌ న్యుమోనియాగా పిలుస్తున్నదానినే ఇప్పుడు కరోనా వైరస్‌ అంటున్నారు. అంతకుముందు సార్స్‌ వచ్చింది. హెచ్‌1ఎన్‌1, స్వైన్‌ఫ్లూ, అవియన్‌ ఫ్లూ అక్కడినుంచే వచ్చాయి. చైనా నుంచి వస్తున్న ఇవి ప్రపంచానికి పెను భారంగా మారుతున్నాయి. అవి విపణి నుంచో లేదా ప్రయోగశాల నుంచో వచ్చినా సరే మనం వాటి అంతు చూడాల్సిందే. కరోనాపై సింగపూర్‌ చాలా పాదర్శకంగా ఉంది. చైనాతో పోలిస్తే మిగతా ఆసియా దేశాల్లో మీడియా స్వేచ్ఛ, పారదర్శకత ఉన్నాయి. దీనిని బట్టి చైనాలో మృతుల సంఖ్య ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు’ అని ఆయన ఘాటుగా విమర్శించారు.

చదవండి: కిమ్‌ ఆరోగ్యంపై ఉత్తర కొరియా మౌనం

చదవండి: చైనా దాన్ని అమలు చేయాల్సిందే.. లేదంటే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని