లాక్‌డౌన్‌తో 4 కోట్ల వలసదారులపై ప్రభావం

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా నెల రోజుల కింద భారత్‌లో విధించిన లాక్‌డౌన్‌తో సుమారు 4 కోట్ల మంది వలసకార్మికులపై ప్రభావం పడిందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. ఈ విషయాన్ని బుధవారం ఓ నివేదికలో వెల్లడించింది...

Published : 23 Apr 2020 12:23 IST

భారత్‌లో పరిస్థితిని వివరించిన ప్రపంచ బ్యాంక్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా నెల రోజుల కింద భారత్‌లో విధించిన లాక్‌డౌన్‌ సుమారు 4 కోట్ల మంది వలస కార్మికులపై ప్రభావం పడిందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. ఈ విషయాన్ని బుధవారం ఓ నివేదికలో వెల్లడించింది. ‘భారత్‌లో లాక్‌డౌన్‌ విధించడంతో దేశంలోని సుమారు 4 కోట్ల మంది అంతర్గత వలస కార్మికులపై ప్రభావం పడింది. గతకొద్ది రోజుల్లోనే సుమారు 50-60 వేల మంది వలసదారులు నగరాలు విడిచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారు’ అని నివేదికలో స్పష్టంచేసింది. అంతర్జాతీయ వలసలతో పోలిస్తే, ఇది రెండున్నర రెట్లు ఎక్కువని ప్రపంచ బ్యాంక్‌ తేల్చి చెప్పింది. 

లాక్‌డౌన్లు, ఉపాధి కోల్పోవడం, సామాజిక దూరం లాంటి అంశాలు వలసదారులపై తీవ్ర ప్రభావం చూపాయని, వీటన్నింటితో మనోవేదన చెంది లక్షల మంది వలస కార్మికులు భారత్‌, లాటిన్‌ అమెరికా దేశాల్లో తమ స్వస్థలాలకు తరలిపోయారని చెప్పింది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగిందని ప్రపంచ బ్యాంక్‌ స్పష్టంచేసింది.  ఆయా దేశాల్లో అంతర్గత వలసలు అడ్డుకొని ప్రభుత్వాలు వారికి అండగా నిలవాలని సూచించింది. వలస కార్మికులకు సరైన వైద్య సదుపాయాలతో పాటు, ఆర్థికంగా ఆదుకోవాలని, సామాజిక భద్రత కల్పించాలని చెప్పింది. కరోనా మహమ్మారి సంక్షోభం దక్షిణాసియా దేశాలపై మరింత ఎక్కువగా ఉందని, అంతర్జాతీయ వలసలతో పాటు అంతర్గత వలసలూ అధికంగా ఉన్నాయని పేర్కొంది. అలాగే గల్ఫ్‌ దేశాల్లో అధికంగా పనిచేసే భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాలకు చెందిన వలస కార్మికులు అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు అమల్లోకి రాకముందే స్వదేశాలకు వెళ్లిపోయారని నివేదికలో తెలిపింది. 

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల్లో సరైన నైపుణ్యాలు లేకపోయినా వలసలు అధికంగా ఉన్నాయని, గతేడాది ఈ దేశాల నుంచి వెళ్లిన వారి సంఖ్య అధికంగా ఉందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. కాగా, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో వలసదారుల బాగోగులు చూడ్డానికి పలు దేశాల ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సమీప భవిష్యత్‌లో అన్ని దేశాలూ కరోనా కట్టడిలో భాగంగా ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందేలా చూస్తాయని వెల్లడించింది. అలాగే వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలు రూపొందించి వారికి అవసరమైన జీవనాధార వసతులతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని ఆశాభావం వ్యక్తంచేసింది. ఈ కరోనా మహమ్మారి.. ప్రపంచ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య నిపుణుల కొరత ఉందని తెలియజేసినట్లు చెప్పింది. అలాగే ప్రపంచ దేశాల సహకారంతో పాటు వైద్య విభాగంలో దీర్ఘకాలిక పెట్టుబడుల అవసరాన్ని కూడా తెలియజేసిందని ప్రపంచ బ్యాంక్‌ స్పష్టం చేసింది. 

ఇవీ చదవండి:

విదేశీ వలసలకు బ్రేక్‌ వేసిన ట్రంప్‌

భారత్‌లో 21 వేల కేసులు, 681 మరణాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని