దేశంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కొరత లేదు...

భారత్‌లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నిల్వలకు కొరత లేదని గుజరాత్‌లోని ఇండియన్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్ (ఐడీఎంఏ) ప్రకటించింది.

Updated : 24 Apr 2020 13:42 IST

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) చికిత్సలో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌. భారత్‌లో ఈ ఔషధ నిల్వలకు కొరత లేదని గుజరాత్‌లోని ఇండియన్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్ (ఐడీఎంఏ) ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో నెలకు 35 నుంచి 40 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు ఉత్పత్తి జరుగుతున్నట్లు సంస్థ చైర్మన్‌ విరంచి షా తెలిపారు. ఇది మన అవసరాల కంటే పదిరెట్లు అధికమని ఆయన వివరించారు. ఇప్పటికే భారత్‌ అవసరాల కోసం పదికోట్ల మాత్రలు సిద్ధంగా ఉన్నాయని... ఇవి 20 లక్షల మంది కొవిడ్‌ బాధితుల చికిత్సకు సరిపోతాయని ఆయన వివరించారు. 

దేశంలో గత ఏడాది సుమారు 2.4 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల వినియోగం జరిగిందని.. దీనితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్నది చాలా అధికమని ఐడీఎంఏ చైర్మన్‌ చెప్పారు. కేంద్ర సహకారంతో ఔషధాల తయారీ, సరఫరాలకు ఏ ఆటంకం లేకుండా సక్రమంగా నిర్వహస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల సిబ్బంది రాకపోకలకు తొలుత ఇబ్బంది ఎదురైందని... ప్రభుత్వ చొరవతో ఈ సమస్యను అధిగమించామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో 70 శాతం మన దేశంలోనే తయారవుతున్నట్లు  విరంచి షా వివరించారు. భారత్‌ నుంచి ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నామని... అంతర్జాతీయ డిమాండుకు తగ్గట్లు ఔషధాలను సరఫరా చేసే సామర్థ్యం మనకుందని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని