కరోనా కట్టడికి నికోటిన్‌తో వైద్యం?

నికోటిన్ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పారిస్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో కరోనా సోకిన వారిపై చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు. త్వరలోనే ఈ దిశగా క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించాలని......

Published : 25 Apr 2020 00:41 IST

క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్న ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు

పారిస్‌: నికోటిన్ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పారిస్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో కరోనా సోకిన వారిపై చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు. త్వరలోనే ఈ దిశగా క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్టు పరిశోధనకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. మొత్తం 343 మంది రోగులను పరీక్షించగా వారిలో 5 శాతం మందికి పొగతాగే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో నికోటిన్‌ ప్రభావం వల్ల రెసిప్టర్‌ సెల్స్‌లోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకున్నట్లు గుర్తించామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన జీన్‌ పియరీ చేంజక్స్‌ అనే న్యూరోబయాలజిస్ట్‌ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ ప్రాంభించేందుకు ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు జీన్‌ వెల్లడించారు. ఈ మేరకు వారు గత నెలలో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అనే పత్రికలో ప్రచురించిన ఫలితాల్ని ఉదహించారు. చైనాలో కరోనా బారిన పడిన ప్రతి వెయ్యి మందిలో 12.6 శాతం మందికి పొగతాగే అలవాటు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదికల ప్రకారం చైనాలో పొగతాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని జర్నల్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. 

ముందుగా నికోటిన్‌ పాచ్‌లను ఆరోగ్య సిబ్బందిపై ప్రయోగించి ఫలితాల ఆధారంగా రోగులకు వీటిని వినియోగించనున్నట్లు పరిశోధకులు తెలిపారు. కరోనా పోరులో భాగంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే సైటోకైన్‌ స్ట్రోమ్స్‌లో కూడా నికోటిన్‌ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు పొగతాగే అలవాటును కానీ, నికోటిన్‌ పాచ్‌ల వినియోగాన్ని పరిశోధకులు ప్రోత్సహిస్తున్నట్లుగా భావించవద్దని తెలిపారు. ‘‘నికోటిన్‌ ఎంత ప్రమాదకారో, దాని వల్ల సంభంవించే నష్టాలను మనం మర్చిపోకూడదు. పొగతాగే అలవాటు లేని వారు నికోటిన్‌ పాచ్‌లను ఉపయోగించకూడదు’’ అని జెరోమ్‌ సాల్మన్ అనే ఫ్రాన్స్ ముఖ్య ఆరోగ్య అధికారి తెలిపారు. పొగతాగే అలవాటు కారణంగా ఫ్రాన్స్‌లో ఏటా 75,000 మంది చనిపోతున్నట్లు ఒక అంచనా. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 1,55,000 మంది కరోనా బారిన పడగా వారిలో 21,000 మంది మరణించారు.  

ఇవీ చదవండి:

చైనా నవంబరులోనే వైరస్‌ను గుర్తించిందా?

వ్యాక్సిన్‌ పరీక్షకు అతిదగ్గరలో ఉన్నాం: ట్రంప్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని