ర్యాపిడ్ కిట్లను వెనక్కు పంపండి

కరోనా నిర్థారణ పరీక్షల కోసం రాష్ట్రాలకు ఇచ్చిన ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లను తిరిగి వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్) రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.......

Published : 27 Apr 2020 20:08 IST

రాష్ట్రాలకు ఐసీఎమ్‌ఆర్‌ కీలక ఆదేశాలు

దిల్లీ: కరోనా నిర్థారణ పరీక్షల కోసం రాష్ట్రాలకు ఇచ్చిన ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లను తిరిగి వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్) రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. చైనా సంస్థలైన గ్వాంగ్‌జోహు వోండ్ఫో బయోటెక్, జుహాయి లివ్‌జోన్‌ డయాగ్నస్టిక్స్‌కు చెందిన కిట్లను ఉపయోగించడం తక్షణం నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. వాటిని పంపిణీ చేసిన డీలర్లకు సదరు కిట్లను తిరిగి పంపాలని సూచించింది. రెండు సంస్థలు తయారుచేసిన ర్యాపిడ్ కిట్ల ఫలితాల్లో తేడాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎమ్ఆర్‌) చీఫ్ బలరాం భార్గవతో ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అనంతరం కిట్లను వెనక్కి తీసుకోవాలని ఐసీఎమ్‌ఆర్‌ రాష్ట్రాలకు సూచించింది.

కొద్దిరోజుల క్రితం చైనా నుంచి దిగుమతి చేసుకున్న కిట్ల ఫలితాల్లో తేడా ఉన్నట్లు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో కిట్ల నాణ్యతను పరిశీలించేందుకు ఐసీఎమ్‌ఆర్ నిపుణుల బృందాలను ఆయా రాష్ట్రాలకు పంపింది. వారి పరిశీలనలో చైనా సంస్థలు తయారు చేసిన కిట్లు తప్పుడు ఫలితాలను వెల్లడిస్తున్నట్లు గుర్తించారు. ఏప్రిల్ మొదట్లో కరోనా ప్రజ్వలన కేంద్రాల్లో (హాట్‌స్పాట్) వేగంగా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎమ్‌ఆర్‌ సిఫార్సు మేరకు కేంద్రం 5 లక్షల రాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్లతోపాటు, ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ కిట్లను దేశవ్యాప్తంగా పంపిణీ చేసింది. అంతేకాకుండా చైనా కంపెనీల నుంచి కిట్లను దిగుమతి చేసుకొన్న సంస్థలు అధిక ధరకు వాటిని కేంద్రానికి విక్రయించినట్లు దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలయింది. దీంతో కేంద్రం ఈ విషయమై వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు సదరు సంస్థలకు ఎటువంటి చెల్లింపులు చేయలేదని తెలిపింది. కిట్ల పంపిణీ కోసం సదరు సంస్థలతో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఇవీ చదవండి...

హాట్‌స్పాట్స్‌లో లాక్‌డౌన్‌ కొనసాగింపు?

వారిని స్వస్థలాలకు చేర్చడం వీలుకాదా?:హైకోర్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని