
వైరస్ పుట్టుకపై ఏకాభిప్రాయం కష్టం: చైనా
విచారణ, దర్యాప్తునకు ఒప్పుకోం.. వాటితో ఫలితం ఉండదు
బీజింగ్: వుహాన్లో వైరస్ పుట్టుకపై విచారణ చేపట్టేందుకు చట్టబద్ధత లేదని చైనా స్పష్టం చేసింది. మహమ్మారులపై గతంలో చేపట్టిన విచారణ, దర్యాప్తులతో ఫలితాలేమీ రాలేదని వెల్లడించింది. అమెరికా సహా ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశంపై విమర్శలు చేస్తుండటంతో ఇలా స్పందించింది.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వైరస్ పుట్టుకపై తటస్థ అతర్జాతీయ విచారణ చేపట్టాలని అనేక దేశాలు కోరుతున్న నేపథ్యంలో చైనా నర్మగర్భంగా స్పందించింది. కొవిడ్-19 సంక్షోభంతో దీర్ఘకాలంలో దేశం బాహ్య ప్రతికూలతలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ శతాబ్దంలోనే తొలిసారి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని చవిచూస్తుండటంతో వన్ బెల్ట్ వన్ రోడ్ తదితర భారీ ప్రాజెక్టులపై ప్రభావం పడనుందని వెల్లడించింది.
పరిస్థితులు సద్దుమణిగాక వైరస్ పుట్టుకపై స్వతంత్ర విచారణకు అంగీకరిస్తారా అని ప్రశ్నించగా విచారణలతో లాభం ఉండదని, గతంలో ఇలాంటివి సాధించిందేమీ లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ అన్నారు. ‘వైరస్ పుట్టుకన్నది శాస్త్రానికి సంబంధించిన అంశం. దీనిని శాస్త్రవేత్తలు, నిపుణులు అధ్యయనం చేయాలి. అంటు వ్యాధులు, వైరాలజీ అధ్యయనాలపై ఉమ్మడి ఆధారాలు లభించాకే సమాధానాలు లభిస్తాయి. ఇది చాలా సంక్లిష్టమైన అంశం. ఇందుకు చాలా సమయం అవసరం. ఎంతో అనిశ్చితి ఉంటుంది’ అని ఆయన అన్నారు.
‘మానవ చరిత్రలో వ్యాధుల కారణాలను కనుగొనేందుకు దశాబ్దాలు పట్టింది. కొంత పురోగతి సాధించినప్పటికీ ఉమ్మడి సమాధానం దొరకలేదు. వాదనలు ఉంటాయి. థియరీలు ముందుకొస్తాయి. ఏం చేసినా వైరస్ ఆవిర్భావం కనుక్కోవడం కష్టమే. వైరస్ పుట్టుకపై రాజకీయం చేయడం శాస్త్ర స్ఫూర్తికి విఘాతమే. ఇది అంతర్జాతీయ సహకారానికి, పరస్పర నమ్మకానికి అంతరాయం కలిగిస్తుంది. ఇప్పటికీ కొందరు విచారణలు, దర్యాప్తులపై హైప్ సృష్టిస్తున్నారు. అవి విజయవంతం కావు’ అని షువాంగ్ పేర్కొన్నారు.