అప్పుడే వినుండాల్సింది: డబ్ల్యూహెచ్‌వో

సలహాలను పెడచెవిన పెట్టకుండా ఉంటే ఇంత అనర్ధం జరిగిఉండకపోనని అమెరికాను ఉద్దేశించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. 

Updated : 29 Apr 2020 05:54 IST

జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి విషయంలో తాము ప్రపంచ దేశాలన్నింటినీ ముందే హెచ్చరించామని.. స్పందించి, జాగ్రత్తపడిన దేశాలు మిగిలిన వాటి కంటే మెరుగ్గా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్‌ తెలిపారు. తమ సలహాలను పెడచెవిన పెట్టకుండా ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30 నాడే అంతర్జాతీయంగా కొవిడ్‌-19 అత్యవసర పరిస్థితి ప్రకటించిందని ఆయన‌ గుర్తు చేశారు. అప్పటికీ చైనాయేతర దేశాల్లో 82 కేసులు ఉండగా... ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు. అప్పుడు ప్రపంచ దేశాలు తమ మార్గదర్శకాలను విని జాగ్రత్తగా ఆచరించి ఉండాల్సిందని ఆయన వివరించారు. 

‘‘కరోనా వైరస్‌ విషయంలో సమగ్రమైన ప్రజారోగ్య విధానాన్ని అవలంబించాల్సిందిగా ప్రపంచ దేశాలను మేం నాడే హెచ్చరించాం.  ‘ఫైండ్‌, టెస్ట్‌, ఐసోలేట్‌ అండ్‌ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌.. అని కూడా మేము సూచించాం. ఈ విధానాన్ని పాటించిన దేశాలు కరోనా విషయంలో మిగితా వాటి కంటే  మెరుగైన స్థితిలో ఉన్నాయి.’’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ వ్యాప్తిని గురించిన వివరాలను దాచి ఉంచిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ఆరోపించారు. ఈ సాకుతో ప్రపంచ అరోగ్య సంస్థకు అతిపెద్ద దాత అయిన అమెరికా, సంస్థకు నిధులను ఇవ్వబోమంటూ విరమించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని