60 శాతం కరోనా కేసులు 15 జిల్లాలోనే...

కరోనా వ్యాప్తి నివారణకు నిరంతర పర్యవేక్షణతో పాటు పరీక్షల నిర్వహణ, చికిత్స అందించడం, వైరస్‌ను అదుపు చేయడంలో మరింత దూకుడుగా వ్యవహిరించడం వంటివి చేయాలని అన్నారు...... 

Updated : 28 Apr 2020 22:28 IST

దిల్లీ: దేశం మొత్తం మీద ప్రధానంగా 15 జిల్లాలోనే 60 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు నిరంతర పర్యవేక్షణతో పాటు పరీక్షల నిర్వహణ, చికిత్స అందించడం, వైరస్‌ను అదుపు చేయడంలో మరింత దూకుడుగా వ్యవహరించడం వంటివి చేయాలని చెప్పారు. ఈ మేరకు నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రతకు సంబంధించి ఒక నివేదికను రూపొందించింది. ఈ జాబితాలో హైదరాబాద్ (తెలంగాణ), పుణే (మహారాష్ట్ర), జైపూర్‌ (రాజస్థాన్‌), ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), అహ్మదాబాద్‌ (గుజరాత్), ముంబయి (మహారాష్ట్ర), దిల్లీ, వడోదరా (గుజరాత్), కర్నూల్ (ఆంధ్రప్రదేశ్‌), భోపాల్ (మధ్యప్రదేశ్‌), జోధ్‌పూర్‌ (రాజస్థాన్‌), ఆగ్రా (ఉత్తరప్రదేశ్‌), థానే (మహారాష్ట్ర), చెన్నై (తమిళనాడు), సూరత్ (గుజరాత్) జిల్లాలుండగా..  వీటిలో మొదటి 7 జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. 

దేశం మొత్తం మీద దిల్లీలోని 11 జిల్లాలోనే 12.62 శాతం కేసులు నమోదయ్యాయని అమితాబ్‌కాంత్‌ వెల్లడించారు. కరోనా పోరులో భారత్ ఎంత మేర విజయం సాధిస్తుందనేది ఈ జిల్లాల్లో కేసుల తీవ్రత తగ్గుదలపై ఆధారపడి ఉంటుదని చెప్పారు. ‘‘దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని వెల్లడించడం మా బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలే కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించడం ద్వారా కేసుల తీవ్రతను తగ్గించుకోవాలి. భారత్‌లోని 60 శాతం పైగా కేసులు 15 ప్రాంతాల్లో నమోదయ్యాయి. కరోనాపై పోరులో విజయం సాధించాలంటే ఆ శాతాన్ని తగ్గించుకుంటూ రావాలి’’ అని అమితాబ్ కాంత్ అన్నారు. మహారాష్ట్ర, దిల్లీలోని నగరాలతో పోలిస్తే గత వారం రోజుల్లో మిగిలిన నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపారు. 

అయితే నీగి ఆయోగ్ నివేదికను పలువురు వైద్య నిపుణులు తప్పుబట్టారు. ఒక్క జిల్లా ఆధారంగా అన్ని ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడం తప్పని అన్నారు. కరోనా నియంత్రణకు పాజిటివ్ కేసులు నమోదయిన ప్రాంతాలను మూసివేయడం మార్గం కాదని, ప్రజలు బాధ్యతగా సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించేలా చేయాలని అభిప్రాయపడ్డారు. 

ఇవీ చదవండి...

ప్లాస్మాథెరపీ ప్రయోగ దశలోనే ఉంది....

15 రోజులు 1500 కి.మీ నడిచి...వ్యక్తి మృతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని