చైనా సరదా వీడియో, అమెరికాకు చురకలు

కరోనా వైరస్‌ ప్రమాదాన్ని గురించి ఎంత హెచ్చరించినా, పెడచెవిన పెట్టిన శ్వేతసౌధం వ్యవహార శైలిని ఆటపట్టిస్తూ చైనా ఓ వీడియోను విడుదల చేసింది.

Published : 01 May 2020 22:41 IST

‘ఒకానొకప్పుడు ఓ వైరస్‌ ఉండేది...’

ఇంటర్నెట్‌ డెస్క్: తాము కరోనా వైరస్‌ ప్రమాదాన్ని గురించి ఎంత హెచ్చరించినా, శ్వేతసౌధం పట్టించుకోలేదని తెలియజేస్తూ, చైనా ఓ వీడియోను విడుదల చేసింది. ‘వన్స్‌ అపాన్‌ ఏ వైరస్‌’ (ఒకానొక సమయంలో ఓ వైరస్‌ ఉండేది) అనే పేరుతో ఫ్రాన్స్‌లో చైనా రాయబార కార్యాలయం ఈ యానిమేషన్‌ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. 1 నిమిషం 39 సెకెన్ల పాటు సాగే ఈ వీడియో నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. 

మరోవైపు చైనా బాధ్యతా రహితంగా ప్రవర్తించిందని... ఆ దేశం సమాచారాన్ని తొక్కిపెట్టడం వల్లే తమ దేశంలో ఇన్ని మరణాలు సంభవించాయని ట్రంప్‌ మండిపడుతున్నారు. కరోనాను ఎదుర్కోవటం, ప్రజల ప్రాణాలను రక్షించటానికే తమ తొలి ప్రాధాన్యమని... చైనాతో ఆర్థిక సంబంధాలు ఆ తరువాతే వస్తాయని ట్రంప్‌ అన్నారు. అంతేకాకుండా ఎగుమతుల ధరల విషయంలో చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తన దేశంలో కరోనా కట్టడి చేయలేక ట్రంప్‌ తమపై కత్తులు దూస్తున్నట్టుగా కనిపిస్తోందంటూ చైనా ఎదురుదాడికి దిగింది. ఈ వీడియోలో ఉన్న చైనా వ్యాఖ్యలు అసత్యమని కొందరు విమర్శిస్తుండగా, ఈ వైఖరి చైనాకు మేలు కంటే ఎక్కువగా కీడే చేయగలదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా, ఒక రోజు కూడా గడవకుండానే ఎనిమిదిన్నర లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ సరదా వీడియోను మీరూ చూసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని