ట్రంప్‌ విమర్శ: చైనాకు మళ్లీ WHO ప్రశంసలు

కరోనా వైరస్‌ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. సమాజం మళ్లీ సాధారణ స్థితికి ఎలా చేరుకుందో వుహాన్‌ను చూసి ప్రతీ దేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అక్కడ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం సంతోషకరమని వెల్లడించింది.....

Published : 02 May 2020 13:22 IST

వుహాన్‌ను చూసి నేర్చుకోవాలని దేశాలకు హితవు

బీజింగ్‌: కరోనా వైరస్‌ను చైనా అద్భుతంగా కట్టడి చేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించింది. సమాజం మళ్లీ సాధారణ స్థితికి ఎలా చేరుకుందో వుహాన్‌ను చూసి ప్రతీ దేశం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అక్కడ కొత్త కేసులేవీ నమోదు కాకపోవడం సంతోషకరమని వెల్లడించింది.

వుహాన్‌ నగరంలోనే మొట్టమొదట కరోనా వైరస్‌ వెలుగుచూసింది. అక్కడి నుంచి ప్రపంచమంతా పాకేసింది. వైరస్‌ వ్యాప్తితో దాదాపు సగం ప్రపంచం ఆంక్షల మధ్యే జీవిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా సరైన సమయంలో సంపూర్ణ వివరాలు ఇవ్వలేదని, మహమ్మారిని నియంత్రించడం, ఇతర దేశాలను హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. డ్రాగన్‌ దేశం మరింత పారదర్శకంగా ఉండాల్సిందని అనేక దేశాలు అంటున్నాయి.

వుహాన్‌లో కరోనా కేసులు సంఖ్య సున్నాకు చేరడంతో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మరియా వాన్‌ కెర్‌ఖోవె చైనాను అభినందించారు. ‘వుహాన్‌లో కరోనా రోగులు లేకపోవడం, ప్రమాదకర కేసులేమీ లేవని తెలియడం స్వాగతించదగ్గ సమాచారం. ఈ ఘనత సాధించినందుకు అభినందనలు’ అని మరియా పేర్కొన్నారని చైనా అధికార మీడియా సంస్థ షిన్హువా తెలిపింది.

‘చైనా నుంచి ప్రపంచం నేర్చుకుంది. ఆంక్షలు ఎలా ఎత్తేయాలో, సమాజాన్ని సాధారణ స్థితికి లేదా సరికొత్త సాధారణ స్థితికి ఎలా తీసుకురావాలో వుహాన్‌ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముంది’ అని మరియా అన్నారు. ఆమె రెండు వారాల పాటు చైనాలో క్షేత్రస్థాయి అధ్యయనానికి వెళ్లి స్థానిక వైద్య బృందాలు, యంత్రాంగంతో కలిసి పనిచేశారు.

‘నేనక్కడ రెండు వారాలు పనిచేశాను. కేసుల సంఖ్య తగ్గించేందుకు ఏం చేశారో చూశాను. వారు అవిశ్రాంతంగా శ్రమించారు. ఆరోగ్య సిబ్బందికే కాదు ఇంట్లో ఉండి సహకరించిన వుహాన్‌ ప్రజలకు మా అభినందనలు. మీ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె సూచించారు.

చదవండి: హెచ్‌-1బీ వీసాదారులకు భారీ ఊరట

చదవండి: కొవిడ్‌-19 చికిత్సకు మరో ఔషధం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని