లాక్‌డౌన్‌ సడలింపు: లిక్కర్‌ షాపుల వద్ద బారులు!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ సడలింపు అమలు చేయడంతో నిత్యవసర వస్తువుల దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో పలురాష్ట్రాల్లో రోడ్లపైన రద్దీ వాతావరణం కనిపించింది.

Published : 04 May 2020 15:11 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ సడలింపు అమలు చేయడంతో నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరచుకోవడంతోపాటు పలు వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో పలురాష్ట్రాల్లో రోడ్లపైన రద్దీ వాతావరణం కనిపించింది. ప్రైవేటు కార్యాలయాలు కూడా తెరచుకోవడంతో ఉద్యోగులు వారి ఆఫీసులకు హాజరయ్యారు. మహారాష్ట్రలో నాసిక్‌ వంటి ప్రాంతాల్లో పలు ఐటీ కంపెనీలు తెరచుకున్నాయి. అయితే ఉద్యోగులను భౌతిక దూరం పాటిస్తూ కార్యాలయాల్లోకి వెళ్లే ముందు వారికి శరీర ఉష్ణోగ్రతలు పరీక్షిస్తున్నారు. దిల్లీలో చాలా ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ప్రజలు రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కేరళలో నిత్యావసర దుకాణాలే కాకుండా షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం లైసెన్సు పొందిన అన్ని దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మల్టీ బ్రాండ్‌ వంటి పెద్ద దుకాణాలు మినహా అన్ని దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. చత్తీస్‌గఢ్‌లో నేటినుంచి ప్రభుత్వ కార్యాలయాలూ ప్రారంభం అయ్యాయి. 

మద్యం దుకాణం వద్ద కిలోమీటరు క్యూ..

ఇక దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో షాపుల ముందు భారీ క్యూలో నిలబడి కొనుగోలు చేయడం కనిపించింది. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో పాటించడం లేదు. ఇక దిల్లీలో దేశ్‌బంధు గుప్తా రోడ్డులోని ఓ మద్యం దుకాణం ముందు దాదాపు కిలోమీటర్‌ వరకు క్యూలో నిలబడ్డారు. దిల్లీలో కొన్ని ప్రాంతాల్లో లిక్కర్‌ షాపుల వద్ద భారీ క్యూ ఉండడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కర్ణాటకలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 7గంటల వరకు విక్రయాలు జరిపేందుకు మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. 

చత్తీస్‌గఢ్‌లో ఓ మద్యం దుకాణం వద్ద బారులు తీరిన జనం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని