భారత్‌లో కోలుకున్నవారు 12 వేలకు పైనే..

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ.. ఈ మహమ్మారితో యుద్ధం చేసి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగానే పెరుగుతుండటం....

Published : 05 May 2020 16:55 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ.. ఈ మహమ్మారితో యుద్ధం చేసి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగానే పెరుగుతుండటం విశేషం. గడిచిన 24గంటల్లోనే 1020 మంది రికవరీ అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 12,726 మంది కోలుకోగా.. రికవరీ రేటు 27.41 %గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అలాగే, గత 24గంటల్లో భారత్‌లో 3900 కొత్త కేసులు; 195 మరణాలు నమోదైనట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 46,433 కేసులు నమోదు కాగా, 1568 మంది మృతి చెందినట్టు ఆయన వెల్లడించారు. 

పెళ్లిళ్లకు 50మంది మించకూడదు: హోంశాఖ

ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని కేంద్ర హోంశాఖ విజ్ఞప్తి చేసింది. వివాహ వేడుకల్లో 50 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతిస్తున్నట్టు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాత్సవ గుర్తు చేశారు. అలాగే, ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పనిచేస్తున్న కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. అలాగే, వారి కోసం తగినన్ని ఫేస్‌ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. భౌతిక దూరం నిబంధనల్ని తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఉద్యోగులందరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 68 రైళ్లలో దాదాపు 70వేల మందికి పైగా వలస కూలీలను తరలించినట్టు తెలిపారు. ఈ రోజు మరో 13 రైళ్లు సేవలందిస్తున్నాయన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని