ఆ దేశాల్లో స్వల్ప మరణాలు.. ఎందుకంటే?

విశ్వవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది మృత్యువాతపడ్డారు. అగ్రరాజ్యంతో సహా ఎన్నో ధనిక దేశాలు కొవిడ్‌-19 మహమ్మారి ధాటికి కకావికలం అవుతున్నాయి.

Updated : 06 May 2020 12:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మందికిపైగా మృత్యువాతపడ్డారు. అగ్రరాజ్యంతో సహా ఎన్నో ధనిక దేశాలు కొవిడ్‌-19 మహమ్మారి ధాటికి కకావికలం అవుతున్నాయి. ముఖ్యంగా అక్కడి కొవిడ్‌-19 మరణాల రేటు ప్రపంచాన్నే దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. కొన్ని ధనిక దేశాల్లో అత్యధికంగా 10శాతానికి పైగా మరణాల రేటు ఉండగా, భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో దాదాపు 3శాతంగా ఉంది. ఇలాంటి సమయంలో సింగపూర్, ఖతార్‌లలో కొవిడ్‌ మరణాల రేటు కేవలం 0.1శాతం కంటే తక్కువగా ఉంది. ఈ రెండు దేశాలు మాత్రం అత్యల్పంగా కొవిడ్‌-19 మరణాల రేటు నమోదుచేయడం గమనార్హం.

సింగపూర్‌లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉన్పప్పటికీ మరణాల రేటు మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పటివరకు సింగపూర్‌లో 19వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా మరణాల రేటు 0.09శాతం ఉంది. మరో సంపన్న దేశమైన ఖతార్‌లో 16వేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా కేవలం 12మంది మాత్రమే మృత్యువాతపడ్డారు. ఇక్కడ మరణాల రేటు 0.07శాతం కన్నా తక్కువగా ఉంది. కరోనా తీవ్రత కొనసాగుతున్న దేశాల్లో ఈ వైరస్ బారినపడిన యువకులతోపాటు అన్ని వయసుల వారు బలౌతున్నారు. ఇలాంటి సందర్భంలో సింగపూర్‌లో కరోనా వైరస్‌ సోకిన 102 సంవత్సరాల మహిళ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం విశేషం.

ఈ రెండు దేశాలు కూడా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలు కావడంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో సఫలీకృతమైనట్టు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కేవలం సంపన్న దేశాలే కాక ఆయా దేశాల్లో ఉన్న మెరుగైన ఆరోగ్య వ్యవస్థ కారణంగా ఎక్కువ మంది వైరస్‌ బారిన పడినప్పటికీ మరణాల రేటు తక్కువ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ఈ దేశాలు ముందస్తుగానే టెస్ట్‌కిట్లను అందుబాటులో ఉంచుకోని.. ఆసుపత్రుల్లో తగినన్ని పడకలను సిద్ధం చేసుకున్నాయి. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్పప్పటికీ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ మరణాల రేటును తగ్గిస్తున్నాయి. యూఏఈలో ఇప్పటివరకు 12లక్షల పరీక్షలు నిర్వహించగా.. జనాభా తక్కువ ఉన్న సింగపూర్‌లోనూ ఇప్పటికే లక్షా నలభైవేలు టెస్టులు నిర్వహించారు.

అయితే, ఆయా దేశాల్లో ఉన్న టెస్టింగ్‌, జనాభా, వయసు, ఐసీయూల సామర్థ్యంపైనే ఈ మరణాల రేటు ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ఏ దేశమైతే ఎక్కువ పరీక్షలు నిర్వహించి, తక్కువ తీవ్రత ఉన్న రోగులను కూడా గుర్తిస్తున్నాయో ఆ దేశాల్లో మాత్రమే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు న్యూ సౌత్‌వేల్స్‌ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త రైనా మాక్‌ఇంటైర్‌ వెల్లడించారు. వయసు పైబడిన జనాభా ఎక్కువగా ఉన్న దేశాలతోపాటు ఐసీయూలు, వెంటిలేటర్ల కొరత ఉన్నదేశాల్లో మాత్రం మరణాల రేటు ఎక్కువగా ఉందని మాక్‌ఇంటైర్‌ అభిప్రాయపడ్డారు. అయితే సింగపూర్‌లో వృద్ధ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ వైరస్‌ బారిన పడుతున్నది మాత్రం విదేశాల నుంచి వచ్చిన యువకులే. అయితే ఆ దేశంలోకి ప్రవేశించే సమయంలోనే అక్కడి ప్రభుత్వం వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఖతార్‌, యూఏఈలు కూడా తమ దేశంలోకి ప్రవేశించే వారికి కచ్చితంగా వైద్యపరీక్షలు నిర్వహించడం వల్లే వైరస్‌ను ఆదిలోనే గుర్తిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా ముందస్తు జాగ్రత్తలు, మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు వైరస్‌ను సమర్థమంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.


ఇవీ చదవండి..

రోగ నిరోధక శక్తే బ్రహ్మాస్త్రం

ఉద్యోగమో..రామచంద్రా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని