నయ్‌కూ హతం.. హిజ్బుల్‌కు పెద్ద చావుదెబ్బే!

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నయ్‌కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. పక్కా సమాచారంతో చక్కని సమన్వయంతో సుదీర్ఘంగా జరిపిన సంయుక్త .....

Updated : 24 Nov 2022 12:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నయ్‌కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. పక్కా సమాచారంతో చక్కని సమన్వయంతో సుదీర్ఘంగా జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ ముష్కరుడిని మట్టుబెట్టి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్‌ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ను చావు దెబ్బ కొట్టగలిగింది. ‘నయ్‌కూను మనం అంతమొందిస్తే దక్షిణ కశ్మీర్‌లో హిజ్బుల్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే’ అని గతంలో కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ అన్న మాటల్ని బట్టి చూస్తే హిజ్బుల్‌లో అతడు ఎంత కీలకమైనవాడో, మరెంతో ప్రమాదికారో అర్థం చేసుకోవచ్చు. పలుమార్లు భద్రతాదళాలకు చిక్కినట్టే చిక్కినా తన చాకచక్యంతో తప్పించుకోగలిగాడు. కానీ, దక్షిణకశ్మీర్‌లోని బేగ్‌పొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో చివరకు హతమయ్యాడు. 

రియాజ్‌ తలపై 12లక్షల రివార్డు

కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రకార్యకలాపాల్లో నయ్‌కూదే కీలక పాత్ర. 35 ఏళ్ల రియాజ్‌  2012లో ఈ ముష్కర గ్రూపులో చేరకముందు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అవంతిపుర జిల్లాకు చెందిన ఇతడు భద్రతా సిబ్బంది, పోలీసు అధికారుల్ని చంపిన ఎన్నో ఘటనల్లో ప్రధాన నిందితుడు. ఏ ++ కేటగిరీకి చెందిన ఉగ్రవాదిగా ముద్రవేసుకున్నాడు. అతడి తలపై రూ.12లక్షల రివార్డు కూడా ఉంది. 

..అలా వెలుగులోకి వచ్చాడు!

కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్‌ చేపట్టాడు. మరో కీలక ముష్కరుడు జాకీర్‌ ముసా ఈ సంస్థ నుంచి వేరైన తర్వాత రియాజే కీలక వ్యక్తిగా మారాడు. కశ్మీర్‌లోయలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 2016లో అనంత్‌నాగ్‌ ఘటనలో అంతమైన  బుర్హాన్‌ వనీతో సన్నిహితంగా మెలిగిన ఫొటోలు కూడా అప్పట్లో వచ్చాయి. బుర్హాన్‌ వనీలాగే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండంతో పాటు  సామాజిక మాధ్యమాలు వేదికగా ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించడంలో సిద్ధహస్తుడు. ఎవరికీ తెలియని రియాజ్‌ నయ్‌కూ 2016 జనవరి తర్వాత వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన షారిక్‌ అహ్మద్‌ భట్‌ అంత్యక్రియల సమయంలో  రైఫిల్స్‌తో గాల్లోకి కాల్పులు జరుపుతూ ముందుకునడుస్తూ కనిపించాడు. 

చిక్కినట్టు చిక్కి చాలాసార్లు తప్పించుకొనేవాడు..

నయ్‌కూను పోలీసు అధికారులు పలుమార్లు చుట్టుముట్టినా.. అతడు తప్పించుకోగలిగాడు. ఈ ముష్కరుడిని పట్టుకొనేందుకు 2018-19లో భద్రతా దళాలు చాలా తీవ్రంగా కష్టపడ్డాయి. కానీ, అతడు దాక్కోవడం.. పోలీసులు వెతకడం కొనసాగుతూ వచ్చింది. నయ్‌కూకు ఉన్న ప్రేమ వ్యవహారాలను కూడా భద్రతా దళాలు ట్రాక్‌ చేశాయి. ‘చినార్‌ చెట్టులా నువ్వు గుర్తొస్తున్నావ్‌..’ అంటూ నయ్‌కూ అతని ప్రేయసికి సందేశం పంపాడనీ .. అయితే, అతడిని పట్టుకొనేందుకు వెళ్లిన సందర్భంలో అక్కడి నుంచి జారుకున్నాడని ఓ అధికారి వెల్లడించారు. 2018లో ఓ ఉన్నతాధికారి ఎదుట లొంగిపోతానని చెప్పి ఆయననూ బోల్తా కొట్టించాడు. ఈ ఏడాది డజన్‌ మంది యువకుల్ని ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరేలా ఆకర్షితుల్ని చేశాడు. హిజ్బుల్‌కు అత్యంత కీలకమైన రియాజ్‌ను మట్టుపెట్టడంతో కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు బలహీనపడే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని