వైద్య సోదరుల అత్యంత కఠిన నిర్ణయం

ఆ సిక్కు వైద్య సోదరులు తమ జీవిత కాలంలోనే అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు! కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించేందుకు తమ గుర్తింపులో ఒక భాగమైన గడ్డాన్ని తీసేయించారు. ఇందులో అంత కష్టమేముంది?అని చాలా మంది అనుకోవచ్చు. సిక్కులు తమ సంప్రదాయం ప్రకారం పాంచ్‌ కకార్‌...

Updated : 06 May 2020 20:22 IST

నేను చికిత్స చేయకుండా ఉండలేను 

టొరంటో: ఆ సిక్కు వైద్య సోదరులు తమ జీవిత కాలంలోనే అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు! కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించేందుకు తమ గుర్తింపులో ఒక భాగమైన గడ్డాన్ని తీసేయించారు. ఇందులో అంత కష్టమేముంది?అని చాలా మంది అనుకోవచ్చు. సిక్కులు తమ సంప్రదాయం ప్రకారం పాంచ్‌ కకార్‌ (ఐదు ‘కె’లు) పాటించి తీరాలి. 

సంజీత్‌ సింగ్‌ సలూజా, రజీత్‌ సింగ్‌ సోదరులు కెనడాలో వైద్యులుగా పనిచేస్తున్నారు. కొవిడ్-19 రోగులకు చికిత్స చేయాలంటే ఎన్‌-95 మాస్క్‌లు పెట్టుకోవాలి. గడ్డం ఎక్కువగా ఉంటే అవి పెట్టుకోవడం కుదరదు. ఎంతో ఆలోచించి, మథనపడిన తర్వాత మత పెద్దలు, సలహాదారులు, కుటుంబీకులు, మిత్రులను అడిగి గడ్డం తీసేయించుకున్నారు. ఈ వార్త అక్కడి బ్రాంట్‌ఫోర్డ్‌ ఎక్స్పోసిటర్‌లో వచ్చింది.

‘సిక్కులకు గడ్డం ఎంతో ప్రధానం. అది వారి గుర్తింపులో భాగం. కానీ మాస్క్‌ పెట్టుకొనేందుకు దాంతో ఇబ్బంది కలుగుతోంది. చాలా ఆలోచించిన తర్వాత సంజీత్‌ సింగ్‌ తన గడ్డం తీసేయించుకున్నారు’ అని ఎంయూహెచ్‌సీ ఆస్పత్రి వెల్లడించింది.

‘మేం పనిచేయకుండా సెలవు తీసుకోవచ్చు. కానీ ఆరోగ్య సిబ్బంది జబ్బు పడుతున్న తరుణంలో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వ్యవస్థపై మేం మరింత భారం మోపదల్చుకోలేదు. కొవిడ్‌-19 రోగులకు చికిత్స చేయననీ చెప్పొచ్చు. అలా చేయడం మా వృత్తిధర్మం, సేవాభావానికి విరుద్ధం’ అని సంజీత్‌ తెలిపారు. ‘ఇది మాకు అత్యంత కఠినమైన నిర్ణయం. కానీ ఈ సమయంలో అవసరంగా భావించాం. ఈ నిర్ణయం నన్ను చాలా బాధపెట్టింది. ఎందుకంటే ఇది నా గుర్తింపులో ఒక భాగం. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ నాకు నేనే భిన్నంగా కనిపిస్తున్నా. విస్మయం కలుగుతోంది’ అని పేర్కొన్నారు.

తన కెరీర్‌లో సింగ్‌ సలూజా ఎన్నో వైరస్‌లకు చికిత్స చేశారు. కరోనా వైరస్‌ అన్నిటికన్నా భిన్నం. ఎన్‌-95 ధరించక తప్పదు. ‘కొవిడ్‌-19 మా సమాజంలో ప్రబలంగా ఉంది. గడ్డంతో ఎన్‌-95 ధరించడం కుదరడం లేదు. ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. నేను చికిత్స చేయకుండా ఉండలేను’ అని ఆయన అన్నారు. సలూజా సోదరుడిదీ ఇదే కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని