విశాఖ ఘటనలో 11కి చేరిన మృతులు 

విశాఖలో ఎల్జీ పాలీమర్స్‌ నుంచి స్టైరీన్‌ విష వాయువు లీకైన దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 11కి చేరినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌......

Published : 07 May 2020 16:30 IST

ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ వెల్లడి

దిల్లీ: విశాఖలో ఎల్జీ పాలీమర్స్‌ నుంచి స్టైరీన్‌ విష వాయువు లీకైన దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 11కి చేరినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ  ఎస్‌ఎన్‌ ప్రధాన్‌  వెల్లడించారు. దిల్లీలో పలువురు కీలక అధికారులు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘‘విశాఖలో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉంది. గ్యాస్‌ లీకేజీ నియంత్రించడంపై దృష్టిపెట్టాం. ఈ గ్యాస్‌ ప్రభావానికి గురైన 200 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో 25 నుంచి 30 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, 80మందికి పైగా వెంటిలేటర్లపైనే ఉన్నారు. స్థానిక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు  ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి ప్రజల్ని ఖాళీ చేయించాయి. ఇళ్లల్లోకి వెళ్లి బాధితులను ఆస్పత్రులకు తరలించాం. ఉదయం 6 గంటలకే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి వెళ్లాయి. 500 మందికి పైగా ప్రజల్ని ఖాళీ చేయించాం’’ అని వివరించారు. 

స్టైరీన్‌ గ్యాస్‌ పీల్చిన వారికి కళ్ల మంట, గొంతునొప్పి, వాంతులయ్యాయని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. మంచినీటితో కళ్లు శుభ్రం చేసుకోవాలని సూచించారు.  గ్యాస్‌కు ప్రభావితమైన వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధితులు వెంటనే ఆక్సిజన్‌ థెరఫీ తీసుకోవాలని కోరారు. ఈ వాయువుతో దీర్ఘకాలిక ప్రభావం తక్కువే ఉంటుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని