కరోనా వైరస్‌: వామ్మో సూపర్‌ స్ప్రెడర్స్‌!

కొవిడ్‌-19. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. పరిశుభ్రంగా ఉండటం, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం ద్వారా కరోనా

Published : 11 May 2020 00:46 IST

అహ్మదాబాద్‌: కొవిడ్‌-19. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. పరిశుభ్రంగా ఉండటం, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మనం ఎన్ని జాగ్రత్తలు పాటించినా, సరకులు, పాలు, కూరగాయలు ఇలా నిత్యావసరాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. దుకాణదారులు, కూరగాయలు అమ్మేవాళ్లు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే వారికి కరోనా సోకితే ఇక అంతే. జనాలతో ఎక్కువ సంబంధం ఉన్న వీళ్లే సూపర్‌ స్ప్రెడర్స్‌ అంటారు. తాజాగా అహ్మదాబాద్‌లో 334మంది సూపర్‌ స్ర్పెడర్స్‌ను గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో మే 15వ తేదీ వరకూ సరకులు, కూరగాయల దుకాణాలను మూసి వేస్తున్నట్లు ఆదివారం వెల్లడించారు.

కూరగాయలు విక్రయించే వాళ్లు, సరకులు, పాలు, దుకాణ యజమానులు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసేవారు, ఇళ్ల నుంచి చెత్తను సేకరించే వారి ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లో ఇప్పటివరకూ 7,797 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 472మంది మృత్యువాతపడ్డారు. కేవలం ఒక్క అహ్మదాబాద్‌లోనే 5,540 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 363 చనిపోయారు. అహ్మదాబాద్‌లో 14వేల సూపర్‌ స్ర్పెడర్స్‌ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వివరాలు సేకరించగా, వచ్చే మూడు రోజుల్లో వారందరినీ స్క్రీనింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ చర్యలు తీసుకుంటామన్నారు.

అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

నిత్యావసరాల కోసం వెళ్లే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ముఖానికి మాస్క్‌, శానిటైజర్‌ తప్పకుండా తీసుకెళ్లాలని, దుకాణం నుంచి వచ్చిన తర్వాత సరకులను  శుభ్రం చేసుకోవడం, కూరగాయలను కడగటం వంటివి చేయాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లూ, చేతులూ శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని