మగవారిలో కరోనా ఇందుకే ఎక్కువట!

కరోనా వైరస్‌ తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ అని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. దీనికి గల కారణాలను కూడా విశ్లేషించాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరూ దీనికి పక్కా శాస్త్రీమైన ఆధారాన్ని మాత్రం పేర్కొనలేదు......

Updated : 11 May 2020 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువ అని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. దీనికి గల కారణాలను కూడా విశ్లేషించాయి. అయితే, ఇప్పటి వరకు ఎవరూ దీనికి పక్కా శాస్త్రీయమైన ఆధారాన్ని మాత్రం పేర్కొనలేదు. మగవారి జీవనశైలి, మహిళల్లో సాధారణంగా ఉండే అధిక రోగనిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు సాగించారు. కానీ, తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఓ ఆసక్తికరమైన ఆధారాన్ని తెరమీదకు తెచ్చింది.

ఇదే అసలు కారణం..

కొవిడ్‌-19 కారక ‘సార్స్‌-కొవ్‌2’ వైరస్‌ ‘యాంజియోటెన్సిన్‌-కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2’ (ఏసీఈ2) అనే ఎంజైమ్‌ సాయంతో కణాల్లోకి ప్రవేశిస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన ‘యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్’‌(యూఎంసీ) తమ అధ్యయనంలో గుర్తించింది. ఇది కణాల ఉపరితలంపై ఉండి కరోనా వైరస్‌ లోపలికి ప్రవేశించేందుకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే తేల్చారు. ఈ ఎంజైమ్‌ మహిళల కంటే పురుషుల రక్తంలో అధికంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఆచార్యులు ఆండ్రియాన్‌ వూర్స్‌ వివరించారు. అందువల్లే కరోనా వైరస్‌ ప్రభావం మగవారిలో అధికంగా ఉన్నట్లు విశ్లేషించారు.

వీటిని వాడితే తీవ్రత తగ్గొచ్చు..

నిజానికి ఈ అధ్యయనాన్ని కరోనా వైరస్‌ వెలుగులోకి రావడానికి ముందే ప్రారంభించామని వూర్స్‌ తెలిపారు. హృద్రోగ సమస్యల్ని అధ్యయనం చేస్తుండగా.. ఏసీఈ2 పురుషుల్లో అధికంగా ఉన్నట్లు తేలిందన్నారు. తాజాగా కొవిడ్‌-19తో మరణిస్తున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉండడంతో ఈ కోణంలోనూ అధ్యయనం చేయడంతో ఏసీఈ2 వల్లేనని గుర్తించామన్నారు. దీనిపై పరిశోధన జరిపిన మరో అధ్యయనంతోనూ తమ ఫలితాలు సరిపోలాయన్నారు. ఈ నేపథ్యంలో కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌, డయాబెటిస్‌, మూత్రపిండాల సంబంధిత వ్యాధిలో ఏసీఈ సాంధ్రతను నియంత్రించడానికి వాడే ఏసీఈ ఇన్‌హిబిటర్స్‌ లేదా ‘యాంజియోటెన్సిన్‌ రిసెప్టార్‌ బ్లాకర్స్‌’(ఏఆర్‌బీ)ను కొవిడ్‌-19 రోగులకు ఇవ్వొచ్చని అధ్యయనంలో సూచించారు. తద్వారా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించొచ్చని అంచనా వేశారు.

వృషణాల్లోనే అధికం..

ఏసీఈ2 ఎంజైమ్‌ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లో ఉంటుందని.. వీటికంటే కూడా వృషణాల్లో అధికంగా ఉంటుందని వూర్స్‌ తెలిపారు. దీనివల్లే ఈ ఎంజైమ్‌ పురుషుల్లో అధికంగా ఉందని.. తద్వారా కరోనా వైరస్‌ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడానికి కారణమవుతోందని విశ్లేషించారు. మరోవైపు ఈ వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ ఎంజైమే దోహదపడుతోందని అంచనా వేశారు. అందుకే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అయితే, ఈ అంశంపై ఇంకా లోతైన పరిశోధన జరిపి ధ్రువీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని