కరోనా: ధూమపాన ప్రియుల్లో తీవ్ర ప్రభావం!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే మూడు లక్షల మంది మృత్యువాతపడగా మరో 40లక్షల మంది ఈ వైరస్‌కు బాధితులుగా మారారు. ఈ మహమ్మారి ముఖ్యంగా మానవ శ్వాసకోస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే.

Updated : 12 May 2020 14:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే 2.85 లక్షలకుపైగా మంది మృత్యువాతపడగా మరో 40లక్షల మంది ఈ వైరస్‌కు బాధితులుగా మారారు. ఈ మహమ్మారి ముఖ్యంగా మానవ శ్వాసకోస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనా విజృంభిస్తోన్న సమయంలో పొగాకు వాడకం ఎంత ప్రమాదకరమో తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పొగాకు వాడకంతో  ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీరిలో 70లక్షల మంది పొగాకు ఉత్పత్తులను నేరుగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతుండగా.. మరో 12లక్షల మంది పరోక్షంగా దీన్ని పీల్చడం వల్ల చనిపోతున్నారని ప్రకటించింది. అంతేకాకుండా ధూమపానం అలవాటు ఉన్నవారిలో కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు ఏప్రిల్‌ 29న ఏర్పాటు చేసిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం గుర్తించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రత్యేక నిపుణులచే పలు పరిశోధనలను జరుపుతోంది. ముఖ్యంగా ధూమపానం, నికోటిన్‌ వాడకానికి, కొవిడ్‌ వైరస్‌కు ఉన్న సంబంధంపై ఇవి కొనసాగుతున్నాయి.

కొవిడ్‌ మహమ్మారి ముఖ్యంగా మానవ శ్వాసకోస వ్యవస్థపై దాడి చేస్తుంది. ఈ సమయంలో కరోనాతో పాటు ఇతర వ్యాధులను ఎదుర్కోవడంలో ధూమపానం శరీరాన్ని బలహీన పరుస్తుంది. ఈ సమయంలో గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌, మధుమేహం ఉన్నవారు ఈ వైరస్‌ బారినపడినప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతోపాటు ప్రమాద తీవ్రతను పెంచుతుందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. దీంతో మరణాలు కూడా సంభవిస్తున్నట్లు తాజా పరిశోధనలు సూచిస్తున్నాయని తెలిపింది.

కొవిడ్‌-19 తీవ్రతను తగ్గించడంలో పొగాకు ఉత్పత్తులు, నికోటిన్‌ వాడకం వంటి ఉపయోగపడతాయన్న వాదనను డబ్ల్యూహెచ్‌ఓ తోసిపుచ్చింది. నిరూపితం కాని ఇలాంటి వాదనల విషయంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులతోపాటు మీడియా సంస్థలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొవిడ్‌-19 చికిత్స, నివారణకు పొగాకు ఉత్పత్తులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఇప్పటివరకు ధూమపానం అలవాటు ఉన్నవారిని పొగాకు ఉత్పత్తులకు దూరం చేయడానికి గమ్‌, ప్యాచెస్‌ వంటి నికోటిన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ప్రమాణికమైన పద్ధతుల ద్వారా మాత్రమే ధూమపానం అలవాటు మానుకోవాలని సూచించింది.

ఇలా మానుకున్న 20నిమిషాల్లోపే అధిక రక్తపోటు, హృదయ స్పందనలు తగ్గి అదుపులోకి వస్తాయి. 12గంటల అనంతరం రక్తప్రసరణలో కార్బన్‌మోనాక్సైడ్‌ సాధారణ స్థాయికి చేరుతుంది. మరో 2నుంచి 12వారాల్లో రక్తప్రసరణ మెరుగవడంతోపాటు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇలా ఒకటి నుంచి తొమ్మిది నెలల కాలంలో దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం తెలిపింది. అందుకే ఇప్పటికే నిరూపితమైన పద్ధతులు మాత్రమే పాటించాలని లేకపోతే ఆరోగ్యంపై అవి ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని