రైలు ప్రయాణికులకు ‘ఆరోగ్య సేతు’ తప్పనిసరి

కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా కేంద్రం ప్రజా రవాణాపై పూర్తి స్థాయి ఆంక్షలు విధించింది....

Published : 12 May 2020 22:54 IST

దిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా కేంద్రం ప్రజా రవాణాపై పూర్తి స్థాయి ఆంక్షలు విధించింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటిలో సడలింపులు ఇస్తోంది. దానిలో భాగంగా మంగళవారం నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అయితే వాటిలో ప్రయాణించే వారు తమ ఫోన్లలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 

ప్రజల సౌకర్యార్థం దిల్లీ, ఇతర ప్రధాన నగరాలకు 15 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించిన రైల్వే సోమవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. మొదట ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌చేసుకోవాలని సూచించింది కానీ తప్పనిసరి చేయలేదు. కానీ తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ యాప్‌ డౌన్‌లోడ్‌ను తప్పనిసరి చేస్తూ ట్వీట్ చేసింది. ‘భారత రైల్వే కొన్ని ప్యాసింజర్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణానికి ముందు ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిగా  డౌన్‌లోడ్ చేసుకోవాలి’ అని దానిలో పేర్కొంది. అలాగే యాప్‌ డౌన్‌లోడ్‌ కోసం లింక్‌ను షేర్ చేసింది. అయితే దాన్ని తప్పనిసరి చేయడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు ఇదివరకే తన ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం. 

కొవిడ్ 19 బాధితులను గుర్తించేందుకు వీలుగా కేంద్రం ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాన్ని ఇప్పటివరకు 9.8 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలాగే కొవిడ్ 19 కంటైన్‌మెంట్ జోన్లలో నివసించే ప్రజలకు దాని వాడకాన్ని హోం మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని