ఆ ప్రశ్న చైనాను అడగండి: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అంటేనే వివాదాలకు పెట్టింది పేరు.

Published : 13 May 2020 02:02 IST

మహిళా విలేకరితో మాటల యుద్ధం


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విలేకరుల సమావేశాన్ని మధ్యలోనే నిలిపివేయడం సంచలనం సృష్టించింది. తాజాగా ఆయన ఓ ఆసియన్‌-అమెరికన్ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆగ్రహానికి గురై మీడియా సమావేశాన్నే రద్దు చేశారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షల విషయంలో ఇతర దేశాల కంటే అమెరికా మెరుగ్గా పనిచేస్తుందని ఎందుకు నొక్కి చెప్తున్నారంటూ సీబీసీ న్యూస్‌ మీడియాలో పనిచేస్తోన్న  జియాంగ్ ట్రంప్‌ను సూటిగా ప్రశ్నించడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. 

‘అమెరికన్లు ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతుంటే ప్రపంచంతో ఈ పోటీ ఎందుకు?’అని జియాంగ్ ప్రశ్నించారు. దానికి ట్రంప్ సమాధానమిస్తూ..‘ప్రపంచంలో చాలా చోట్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీరు ఆ ప్రశ్న చైనాను అడగాలనుకుంటా. నన్ను కాదు, చైనాను అడగండి.?’ అన్నారు. దానికి ఆమె వెంటనే  ‘చైనాను అడగమని నాకే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారు?’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇలాంటి పిచ్చి ప్రశ్న వేసిన ఎవరికైనా ఇదే చెప్తానంటూ అంటూ ట్రంప్‌ తన తీరును బయటపెట్టారు. ఆమె వెంటనే తనది పిచ్చి ప్రశ్న కాదంటూ బదులిచ్చారు. దానికి ట్రంప్‌ నిశ్శబ్దంగా ఉండి, ఆ వెంటనే మరో మహిళా విలేకరికి అవకాశం ఇచ్చారు. ఆమె ప్రశ్నించేలోపే తన సమావేశాన్ని అర్థాంతరంగా ముగించేశారాయన. ఇదిలా ఉండగా జియాంగ్ చైనాలో జన్మించారు. తన చిన్నతనంలోనే ఆమె కుటుంబం అమెరికాకు వలస వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని