Published : 13 May 2020 02:05 IST

కరోనా.. ఈ 2020ని మర్చిపోలేం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో గత మూణ్నెళ్ల కాలంలో ఎక్కడ విన్నా, ఏ వైపు చూసినా కరోనా.. కరోనా.. కరోనా! అంతగా జనజీవనాన్ని అతలాకుతలం చేసిందీ కొవిడ్‌. ప్రపంచ విరోధిగా ఉన్న ఈ కరోనా మనిషి జీవన శైలినే మార్చేసింది. చరిత్ర పుటల్లో కనీవినీ ఎరుగని రీతిలో జనజీవితాల్ని ప్రభావితం చేస్తూ విజృంభిస్తున్న ఈ మహమ్మారితో ఎందరికో ఇబ్బందులు.. మరెందరికో అవస్థలు? పూటగడక పస్తులున్నవారెందరో..! ఇప్పటివరకు ఏ మందూ మాకూ లేని ఈ మాయదారి రోగం నుంచి బయటపడాలంటే ఇంట్లో ఉండటం, భౌతిక దూరం పాటించడమే సరైన విరుగుడు. ఈ కరోనా కాలంలో ఇళ్ల నుంచి బయటకు రాలేక కొందరు, చాలీచాలని ఆదాయంతో ఇంకొందరు, అనారోగ్య సమస్యలతో మరెందరో అవస్థలు పడ్డారు. ఇంటిల్లిపాదీ ఇంట్లోనే ఉండటం, వర్క్‌ఫ్రం హోం కల్చర్‌ అలవడటం, మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యం పెరగడం వంటి సానుకూల పరిస్థితులు ఈ సమయంలోనివే. భారత్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించి దాదాపు 50రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కరోనా చేసిన ఎన్నో గాయాలు, గుర్తుల మేళవింపే ఈ కథనం..  

‘కూలీ’న బతుకులు

ఏ పూటకాపూట రెక్కాడితేగానీ డొక్కాడని వలస జీవులు బతుకులు లాక్‌డౌన్‌తో పూర్తిగా తలకిందులయ్యాయి. నగరీకరణ నేపథ్యంలో పనిచేసి పైసా కూడబెట్టుకుందామని పల్లె నుంచి పట్నం బయల్దేరి వచ్చిన వలస జీవుల ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. పైగా వారి బతుకులను మరింత ప్రమాదంలోకి నెట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా వలస జీవి పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఉన్న చోట ఉపాధి కరవై స్వస్థలాలకు వెళ్లే మార్గంలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న ఆశతో వందల కి.మీల మేర గమ్యానికి చేరుకుంటున్న క్రమంలో వారి కన్నీటి వ్యథ మాటల్లో చెప్పలేనిది. ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోని స్వస్థలాలకు బయల్దేరుతూ రైలు పట్టాలపై నిద్రపోయిన కూలీలపై నుంచి ఓ గూడ్స్‌ రైలు దూసుకెళ్లడంతో ఔరంగాబాద్‌లో 20 మంది కూలీలు మరణించడం తీవ్ర విషాదం నింపింది. 

కరోనా వారియర్స్‌కు సలాం..!

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రోగులకు అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రజలంతా సలాం కొట్టారు. వారికి కృతజ్ఞతగా ఇళ్ల ముందుకు వచ్చి చప్పట్లతో వారి సేవల్ని అభినందించారు. భారత్‌, యూకేతో పాటు అనేక దేశాల్లో ప్రజలంతా తమ ఇళ్ల బాల్కనీల ముందు నిలబడి చప్పట్లు, బెల్స్‌తో మార్మోగించి తమ సంఘీభావాన్ని చాటారు. ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు అవిశ్రాంతిగా పనిచేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే.. శిక్షలు వినూత్నం!

ప్రభుత్వాలు ఎంత చెప్పినా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి బయటకు వచ్చేవారిని నిలువరించడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అలాంటివారికి వినూత్న శిక్షలు విధిస్తున్నారు. కప్పగంతులు వేయించడం, గుంజీలు తీయించడం, యమ్‌రాజ్‌ వేషాలు వేయించడం.. అలాగే,  తమిళనాడులో అయితే ఓ వ్యక్తికి కరోనా పేషెంట్‌ మాదిరిగా దుస్తులు వేసి అంబులెన్స్‌లో పడుకోబెట్టి ఉల్లంఘనులను బలవంతంగా ఆ అంబులెన్స్‌లోకి ఎక్కించడం చూశాం. మరికొన్ని చోట్ల డ్యాన్స్‌లు చేయించడం వంటి శిక్షలు కూడా పలువురికి నవ్వు తెప్పించేవిధంగా ఉన్నాయి. 

మందుబాబుల హంగామా

లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఇటీవల సడలించిన కేంద్రం.. దేశ వ్యాప్తంగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం దుకాణాలకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇంతకాలం మద్యంలేక అల్లాడిన మందుబాబులు ఒక్కసారిగా దుకాణాల వద్దకు పోటెత్తారు.దుకాణం తెరవడానికి కొన్ని గంటల ముందే అక్కడికి వెళ్లి బారులు తీరడంతో భౌతికదూరం నిబంధనలు హుష్‌కాక్‌ అయ్యాయి. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మద్యంపై అదనంగా 70శాతం పన్ను వేసినా మందుబాబుల హంగామా మాత్రం కొనసాగింది. 

ఆఖరి చూపు లేకుండానే.. 

లాక్‌డౌన్‌ కాలంలో అనుకోకుండా ఎవరైనా మరణిస్తే వారిని ఆ కుటుంబ సభ్యులు సైతం ఆఖరి చూపు చూసుకోలేని హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్‌తో ఒక్కొక్కరు ఒక్కోచోట చిక్కుకుపోవడంతో స్వగ్రామాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో వారి కుటుంబ సభ్యులు మృతిచెందినా కడసారి చూసుకొనేందుకు సైతం వీలులేక శోకంతో విలపించిన వారెందరో! మరోవైపు, కరోనా నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం విధించిన మార్గదర్శకాల నేపథ్యంలో కరోనాతో ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలకు 5గురికి మించరాదు. అలాగే, వేరే కారణాలతో మరణించిన వారికి అంత్యక్రియలకు 20 మంది వరకు పాల్గొనే వెసులుబాటుకల్పించింది. 

వీడియో కాల్స్‌లోనే ఒక్కటవుతున్నారు!

కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లలోనూ కొత్త పోకడలు వచ్చాయి.  మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు బయటపడకముందే పెళ్లిళ్లు నిశ్చయం కావడంతో వాటిని రద్దు చేసుకోవడం ఇష్టంలేని వాళ్లంతా తమ ఎంగేజ్‌మెంట్‌లు, వివాహ వేడుకలను ఆన్‌లైన్‌ వేదికగానే కానిచ్చేశారు. ఉద్యోగాలు చేస్తున్న వారు లాక్‌డౌన్‌ కారణంగా ఒక్కోప్రాంతంలో చిక్కుకు పోవడంతో వీడియో కాల్‌ద్వారానే ఒక్కటయ్యారు. అలాగే, పెళ్లి తంతుకు హాజరయ్యే వారి సంఖ్యలో కూడా పరిమితులు విధించిన విషయం తెలిసిందే.

భూమాత కోలుకుంటోంది..

ఇన్నాళ్లూ కర్బన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యంతో తీవ్రంగా దెబ్బతిన్న పర్యావరణం క్రమంగా మెరుగుపడుతోంది. మరీ ముఖ్యంగా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండటంతో భూమాత కోలుకుంటోంది. కాలుష్యం తగ్గిన కారణంగా గాలి నాణ్యత బాగా పెరిగింది. గంగా నదిలో కాలుష్యం తగ్గడంతో  ఆ నీరు తాగేందుకు అనువుగా మారింది. ఆర్కిటిక్‌పైన తీవ్రంగా దెబ్బతిన్న ఓజోన్‌ పొర దాదాపు 1మిలియన్‌ చదరపు కి.మీల మేర తిరిగి ఏర్పడినట్టు సమాచారం . 

మారిన తరగతి గది స్వరూపం 

కరోనా మహమ్మారి విజృంభణతో విద్యా సంవత్సరం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో తరగతి గది స్వరూపమే పూర్తిగా మారిపోయింది. లాక్‌డౌన్‌తో పాఠశాలలు పూర్తిగా మూతపడటంతో ఇంటి వద్దే ఉంటున్న పిల్లలకు ఆన్‌లైన్‌ బోధనలు కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం 8గంటలకే విద్యార్థులు తమ పనులు పూర్తి చేసుకొని కంప్యూటరో/ స్మార్ట్‌ఫోన్‌ వద్దో శ్రద్ధగా కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నారు.

మనిషంటేనే తాకాలంటేనే అమ్మో భయం..!

కరోనా నేపథ్యంలో తుపాకులు, బుల్లెట్లకు కాదు మనిషి దగ్గరకు వెళ్లాలంటేనే భయం నెలకొంది. మనిషి జీవితంలో సర్వసాధారణంగా ఉండే కౌగిలింతలు, ముద్దులు దూరమయ్యాయి.  కష్టకాలంలో మనిషికి ప్రేమ, ఆప్యాయతలే అండగా ఉండాల్సి ఉన్నా.. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం అలాంటివాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కుటుంబ సభ్యులు, సన్నిహితులనే కాదు.. కరెన్సీ నోట్లను తాకాలన్నా భయపడుతున్నారు జనం. 

పిల్లో ఛాలెంజ్‌.. ఇదో కొత్త ట్రెండ్‌! 
లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన జనం తమలో కొత్త క్రియేటివిటీని బయటకు తీస్తున్నారు. కొత్త తరహా ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే ‘పిల్లో ఛాలెంజ్‌..’. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ ఛాలెంజ్‌ను ఇటీవల సినీతారలు తమన్నా, పాయల్‌ రాజ్‌పుత్ ప్రయత్నించారు. 

ఆన్‌లైన్‌ కన్సార్టులు

బహిరంగ సమావేశాలు, జనం గుంపులుగా చేరడంపై కరోనా ముప్పు అధికంగా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై అన్ని ప్రభుత్వాలూ నిషేధం విధించాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంగీత కళాకారులు తమ కన్సార్ట్‌లను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తూ ప్రేక్షకులను ఉల్లాసపరుస్తున్నారు.

క్లబ్బుల్లేవ్‌.. డీజేల్లేవ్.. జూమ్‌ పార్టీల వైపే మొగ్గు! 

కరోనా కాలంలో వేడుకలన్నీ వీడియో కాల్స్‌ ద్వారానే జరిగిపోతున్నాయి.  స్నేహితులు, కుటుంబ సభ్యులతో తమ ప్రత్యేక వేడుకల్ని జరుపుకొనేందుకు చాలా మంది జూమ్‌ పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు. 

వైద్య సిబ్బందిపై దాడులు

ఈ ఆపత్కాలంలోనూ రాత్రనక పగలనక పనిచేసిన వైద్యులపైనా కొందరు అవివేకంతో దాడులకు తెగబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల వైద్యులు, నర్సులపై దాడులు జరిగాయి. కొందరు ఇంటి యజమానులైతే వైద్య  సిబ్బందిని ఇంటికి రానీయకుండా వివక్షతతో చూసిన సందర్భాలనూ చూశాం. అలాగే, మరికొన్ని చోట్ల కరోనా రోగులకు వైద్య సేవలందించి ఇంటికి వచ్చిన వైద్యులకు పూల వర్షం కురిపించిన ఘటనలూ ఉన్నాయి. 

మాస్క్‌లిక తప్పనిసరే..
కరోనా నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతిఒక్కరికీ మాస్కులు ధరించడం తప్పనిసరైంది. ఇప్పటికే నిత్యావసరాలుగా మారిన ఈ  మాస్కులు, గ్లౌజ్‌లు జీవితంలో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు బ్యూటీ బ్లాగర్లు కొత్త ట్రెండ్స్‌కు తెరతీస్తున్నారు. మాస్క్‌ ఉన్నా మేకప్‌ లుక్స్‌తో అలరిస్తున్నారు. 

బుల్లెట్ల కన్నా ఉమ్మే ప్రమాదకరం

తుపాకులు, బుల్లెట్ల కన్నా ఈ సమయంలో ఉమ్మి ఓ ప్రమాదకరంగా మారింది. ఉమ్మి ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తుంది గనక ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరైనా బయట ఉమ్మితే భారీ జరిమానాలను కూడా విధిస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన కొందరు తమను అరెస్టు చేసిన పోలీసులపై ఉమ్మివేసి తప్పించుకున్నారు. ఈశాన్య భారతంలో ఓ వ్యక్తి ఓ మహిళపై పాన్‌ నమిలి ఉమ్మివేసిన విషయం కలకలం రేపింది. 

 

 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts