వారికి సకాలంలో వేతనాలు చెల్లించాల్సిందే..!

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ) ఆదేశించింది......

Published : 13 May 2020 19:18 IST

ఇంజినీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు

దిల్లీ: కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ బోధన, బోధనేతర సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అన్ని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, సాంకేతిక సంస్థల్ని ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి’(ఏఐసీటీఈ) ఆదేశించింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు కూడా వేతనాలు చెల్లించలేదని ఫిర్యాదులు వెల్లువెత్తిన వేళ ఏఐసీటీఈ స్పందించి ఈ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంక్షోభం కొనసాగుతున్న వేళ యాజమాన్యాల వేతనాల కోత నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే కాలేజీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో అందరికీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

అలాగే ఫీజుల చెల్లింపుల విషయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని గత నెలలోనే ఏఐసీటీఈ కాలేజీలను ఆదేశించింది. ఉద్యోగులను సైతం విధుల్లో నుంచి తొలగించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అందిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఏఐసీటీఈ సంస్థలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 

దేశంలో కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 16న అన్ని విద్యాసంస్థల్ని మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత మార్చి 24న దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను పలు దశల్లో మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని