నగరాల్లోనే నంబరెక్కువ!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 75వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 2,415కి చేరింది. ఎక్కువగా కేసులు నమోదైన దేశాల్లో చైనాలో 11వ స్థానంలో ఉండగా.. భారత్‌ 12వ....

Published : 13 May 2020 17:24 IST

కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కేసుల సంఖ్య 75వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 2,415కి చేరింది. ఎక్కువగా కేసులు నమోదైన దేశాల్లో చైనాలో 11వ స్థానంలో ఉండగా.. భారత్‌ 12వ స్థానంలో ఉంది. రోజుకు 3వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని మనం దాటేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. అందులోనూ ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రంలో తీవ్రంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాల పరిస్థితిని గమనించినప్పుడు ఈ పరిస్థితి అర్థమవుతుంది.


మహారాష్ట్రకు ముం‘భయం’

మొదటి నుంచీ ఎక్కువ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ కేసుల సంఖ్య 25 వేల మార్కుకు చేరువైంది. 921 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు 5,125 మంది కోలుకున్నారు. ఆ రాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకు 14,781 కేసులు నమోదయ్యాయి. 556 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని 60 శాతం కేసులు ఇక్కడివే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని మరో నగరం పుణెలో సైతం కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ 2,937 కేసులు నమోదు అవ్వగా.. 12 మంది మరణించారు.


దిల్లీని వీడని కేసులు

దేశ రాజధానిని కొవిడ్‌-19 మహమ్మారి వీడడం లేదు. విదేశీ ప్రయాణికుల రాకతో తొలుత దిల్లీలో కేసులు వెలుగుచూడగా.. అనంతరం తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం దిల్లీలో కేసుల పెరుగుదలకు కారణమైంది. ఇప్పటికీ అక్కడ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం 7,639 కేసులతో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 86 మంది మరణించారు. కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం, మరణాల సంఖ్య తక్కువగా ఉండడం ఊరట కల్పించే విషయం. 


గుజరాత్‌కు అహ్మదా‘బాధ’

కరోనా కేసుల పరంగా దేశంలో గుజరాత్‌ రెండోస్థానంలో నిలిచింది. ముఖ్యంగా అహ్మదాబాద్‌ నుంచే ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో 8,903 కేసులు నమోదు అవ్వగా.. 537 మరణాలు సంభవించాయి. అందులో ఒక్క అహ్మదాబాద్‌ నుంచే 6,353 కేసులు నమోదు కాగా.. 421 మరణాలు అక్కడే సంభవించడం గమనార్హం. రాష్ట్రంలోని దాదాపు 70 శాతం కేసులు ఒక్క అహ్మదాబాద్‌లోనే నమోదు అవుతున్నాయి. పైగా అక్కడ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండడంతో ఇటీవలే దిల్లీ ఎయిమ్స్‌కు చెందిన నిపుణులు అక్కడి కొవిడ్‌-19 ఆస్పత్రులను సందర్శించారు. వైద్యులకు సూచనలు చేశారు.


చెన్నై కోయం‘బ్లేడు’

తొలినాళ్లలో మర్కజ్‌.. ఇప్పుడు కోయంబేడు మార్కెట్‌ తమిళనాడు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో ఈ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి వల్ల తొలినాళ్లలో అత్యధిక కేసులతో తమిళనాడు తల్లడిల్లింది. వాటిని కట్టడి చేసే లోపే చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌ హాట్‌స్పాట్‌గా మారింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 8718 కేసులు నమోదు అవ్వగా.. 61 మరణాలు సంభవించాయి. అందులో 4,882 కేసులు ఒక్క చెన్నై నగరం నుంచే వెలుగు చూడడం గమనార్హం. మొత్తం కేసుల్లో సుమారు 56 శాతం ఈ నగరం నుంచే నమోదు అయ్యాయి.

కేసుల పరంగా ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్‌లో 4021 కేసులు నమోదు అవ్వగా..117 మరణాలు సంభవించాయి. అందులో 1281 కేసులు జైపూర్‌లో వెలుగుచూశాయి. అంటే దాదాపు 30 శాతానికి పైగా కేసులు ఇక్కడివే. ఇవి కాక మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా నగరాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తెలంగాణ విషయానికొస్తే ఇటీవల కొత్తగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వెలుగు చూస్తుండడం గమనార్హం.

ధారం: మంగళవారం రాత్రి వరకు ఉన్న డేటా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు