ఆగస్టుకు ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్’

విశ్వ మహమ్మారి కరోనా విజృంభణతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు...

Updated : 15 May 2020 02:04 IST

నిర్మలమ్మ 9 పాయింట్ ఫార్ములా..

దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా ఈ రోజు తొమ్మిది విభాగాల కేటాయింపులను ఆమె మీడియాకు వివరించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగ కల్పన తదితర అంశాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నాం. సన్న కారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కిసాన్‌ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలు. దేశంలో 3 కోట్ల మంది రైతులకు  రూ.4.22లక్షల కోట్ల రుణాలు ఇప్పటికే మంజూరుచేశాం. ఈ రుణాలపై మూడు నెలల మారటోరియం కల్పిస్తున్నాం. రైతులకు 25లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేశాం. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చిలో రూ. 29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసింది. ఇంతటితో వ్యవసాయరంగానికి సాయం ముగిసినట్టు కాదు’’ అని వివరించారు.

దేశమంతా ఒకే కనీస వేతనం ఉండేలా చేస్తాం..
‘‘వలస కార్మికులు ఉన్న చోటే కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉపాధి పొందవచ్చు. దేశంలో ప్రస్తుతం 30 శాతం మందికే  కనీస వేతనం అందుతోంది. దీన్ని సార్వజనీనం చేయాలని నిర్ణయించాం. రాష్ట్రాల మధ్య కనీస వేతనంలో వ్యత్యాసాలు ఉన్నాయి. దేశమంతా ఒక్కటే కనీస వేతనం ఉండేలా చేస్తాం. వసల కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకొనేలా వెసులుబాటు కల్పిస్తాం.  సంస్థలు, కంపెనీలన్నీ నేరుగా కార్మికులను నియమించుకొనేలా ఏర్పాటు. 10 మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తాం. సుదూర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తాం. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు ఇప్పటికే రూ.11,002 కోట్లు కేటాయించాం’’ అని చెప్పారు.

ఆగస్టు నాటికి వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు..
‘‘‘ ఒకే దేశం - ఒకే రేషన్‌ కార్డు’ విధానం ప్రజా పంపిణీ విధానంలో కొత్త విప్లవం తీసుకొస్తుంది.  రేషన్‌ కార్డు ఉన్న వారు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. రేషన్‌ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఒక్కో వ్యక్తికి 5కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తాం. ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు, రేషన్‌ కార్డు లేనివారు కూడా బియ్యం, గోధుమలు, పప్పు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా.. కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. రేషన్‌ కార్డుదారులకు 2 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తాం. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. రేషన్‌ కార్డు పోర్టబులిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నాటికి ఒకే దేశం - ఒకే కార్డు విధానం అమలులోకి తీసుకొస్తాం.  మార్చి 31, 2021 నాటికి వంద శాతం రేషన్‌ కార్డు పోర్టబులిటీ పూర్తవుతుంది. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు వస్తుంది’’ అని తెలిపారు.

వలస కార్మికులకు మూడు పూటల భోజనం!
‘‘పట్టణ పేదలు, వలస కూలీలకు రోజుకు మూడు పూటలా అన్నపానీయాల కోసం కృషిచేస్తున్నాం.  సహాయ శిబిరాలు,  భోజన ఏర్పాట్లకు రూ.11వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణీ చేశాం. అన్నపానీయాలు అందించేందుకు నిరంతర కృషిజరుగుతోంది. వలస కార్మికులకు ఉపాధి కోసం మే 13 నాటికి 13 కోట్ల పనిదినాలు కల్పించాం.  పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.12వేల కోట్లు ఇప్పటికే అందించాం. పైసా పోర్టల్‌ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్‌ ఫండ్‌ అందించాం. కొవిడ్‌ సమయంలోనే 7200 నూతన స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి’’ అని తెలిపారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని